తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంలో భాగంగా బీజేపీ పార్టీ (BJP Party) దరఖాస్తు స్వీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త విధానాన్ని అమలు చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఆశావాహుల నుంచి అర్జీలను స్వీకరించింది. ఆశావహుల నుంచి విశేష స్పందన లభించింది.తొలి రోజు 63 మంది ఆశావహులు 182 అప్లికేషన్లు సమర్పించారు. రెండో రోజు 178 దరఖాస్తులు, మూడో రోజు 306, నాలుగో రోజు మొత్తం 333, ఐదో రోజు మొత్తం 621 అప్లికేషన్లు, ఆరో రోజు 1603, చివరిరోజైన ఏడో రోజు 3223 అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం 6,011 దరఖాస్తులు వచ్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియలో మాత్రం పక్షపాత ధోరణి వహించినట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలకొక లెక్క.. సాధారణ లీడర్లకొక లెక్క అన్నట్లుగా తీరు మారింది.
వేళ్ల మీద లెక్కపెట్టే మంది ముఖ్య నేతలు మినహా ఇతర కీలక నేతలెవరూ దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవాల్సిందేనన్న హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay), సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా లక్ష్మణ్ కొనసాగుతున్నారు. కాగా వీరిలో ఏ ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసుకోలేదు. అమెరికా పర్యటనలో ఉండటంతో దరఖాస్తు చేసుకోలేకపోయారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని జాతీయ నాయకత్వం ఆదేశించినా నేతలెవరూ పట్టించుకోలేదు. పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలుండగా గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja SIngh)ను పార్టీ సస్పెండ్ చేసింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(MLA Etela Rajender) దరఖాస్తు చేసుకోలేదు. గజ్వేల్ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈటల అభిమానులు శనివారం అప్లికేషన్ దాఖలు చేశారు. ఈటల జమున పేరిట సైతం గజ్వేల్ నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు వచ్చింది. అయితే ఇవి తాము చేసిన అప్లికేషన్లు కావని.. తమ పేరిట అభిమానులు చేసి ఉంటారని ఈటల వర్గం చెబుతోంది.జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna), వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం దరఖాస్తు చేసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ముఖ్య నేతల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, షాద్‌నగర్ నుంచి ఆయన తనయుడు మిథున్ రెడ్డి, గోషామహల్ నుంచి విక్రమ్‌గౌడ్, ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మి ఉన్నారు.
హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి గంగిడి మనోహర్‌రెడ్డి, కొప్పెర శ్యామల, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీకరెడ్డి, వేములవాడ నుంచి తుల ఉమ, వికాస్‌రావు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, శేరి లింగంపల్లి నుంచి గజ్జెల యోగానంద్, రవికుమార్ యాదవ్, నర్సాపూర్ నుంచి మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, ఖైరతాబాద్ నుంచి ఎన్వీ సుభాష్, జూబ్లీహిల్స్‌కు జూటూరి కీర్తిరెడ్డి, నారాయణఖేడ్ నుంచి సంగప్ప దరఖాస్తు చేసుకున్నారు.
భద్రాచలం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి, మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, నారాయణ పేట, ఖమ్మం స్థానాలకు సినీనటి కరాటే కల్యాణి, సనత్‌నగర్ ఆకుల విజయ, సనత్‌నగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, ముషీరాబాద్ స్థానాలకు ఆకుల శ్రీవాణి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలకు సినీ నటి జీవిత దరఖాస్తు చేసుకున్నారు. ఆందోల్ నుంచి బాబు మోహన్ దరఖాస్తు చేసుకున్నారు. పాలకుర్తి నుంచి రవీంద్ర నాయక్, బక్క నాగరాజు యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్య నేతలెవ్వరూ దరఖాస్తు చేసుకోకపోవడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. దరఖాస్తులు నామమాత్రంగా స్వీకరించారనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.