పెళ్లిళ్లకు ఎన్నికల కోడ్ కష్టాలు.. రూ.50 వేలకంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లకూడదు
రాష్ట్రంలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొనగా.. మరోవైపు వివాహాల సీజన్ మొదలైంది. ఎన్నికల కోడ్‌తోనే ప్రారంభమైన ముహూర్తాల మంచిరోజులు ఫలితాల వెల్లడితో ముగియనున్నాయి. ఈ కాలంలో వివాహ ఏర్పాట్లు చేసుకుంటున్నవారికి ఎన్నికల ‘కోడ్’ కష్టాలు తెచ్చింది. ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ విధించిన నగదు పరిమితి నిబంధన పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కో వ్యక్తి 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్లకూడదు. ఒకవేళ తీసుకెళ్లినా కచ్చితమైన ఆధారాలు చూపించాలి.
నగరాలు, పట్టణాల్లోనే కాదు.. మారుమూల గ్రామాల్లోనూ పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. బ్యాగులనూ తెరిచి చూస్తున్నారు. 50 వేలకు మించిన నగదుకు ఆధారాల్లేకుంటే సీజ్ చేస్తున్నారు. దీంతో శుభకార్యాల నిమిత్తం దుస్తుల కొనుగోలు నుంచి పెళ్లిపందిరి వరకు ఆర్డర్లు ఇచ్చుకుంటున్నవారికి తనిఖీలతో ఇబ్బందులు తప్పడం లేదు. వివాహ వేడుకల లావాదేవీల్లో సగానికిపైగా నగదు రూపంలో జరుగుతుంటాయి. పెళ్లిపందిరి, భోజనం ఏర్పాట్లు, బాజాభజంత్రీలు ఇతరత్రా కలిపి పెళ్లి ఖర్చు కనిష్ఠంగా 5 లక్షల రూపాయలపైనే అవుతుంది.
ఇక దుస్తులు కొనేందుకు కనీసం లక్ష నుంచి లక్షన్నర అవసరం. శుభకార్యాల పనుల నిమిత్తం ఇంటి నుంచి నగదుతో బయలుదేరినవారు.. అందుకోసమే తీసుకెళ్తున్నామంటూ పోలీసులను ప్రాధేయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో చేబదుళ్లు ఇచ్చేవారూ కోడ్ నిబంధనలతో వెనకడుగు వేస్తున్నారు. చేబదులు ఇచ్చినా లెక్కలు చూపించాల్సి వస్తుందన్న భయంతో ముందుకు రావడం లేదు. దీంతో సామాన్యులకు అప్పులు పుట్టడమూ కష్టంగా మారింది. అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించేందుకు కొందరు కష్టాలు పడుతున్నారు. కూలి పనులు చేసి దాచుకున్న సొమ్ముకు ఆధారాలు ఎక్కడి నుంచి చూపించగలమని కొందరు ప్రశ్నిస్తున్నారు.