ప్రముఖ టెలివిజన్, బాలీవుడ్ సినీ నిర్మాత ఏక్తాకపూర్‌కు అరుదైన గౌరవం లభించింది. టెలివిజన్ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు’ను అందుకోనున్నారు. న్యూయార్క్‌లో ఈ ఏడాది నవంబర్ 20న జరగనున్న 51వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ప్రదానోత్సవం వేడుకల్లో నిర్వాహకులు ఏక్తాకపూర్‌ను ఈ అవార్డుతో గౌరవించనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్, సైన్స్ అధ్యక్షుడు, సీఈవో బ్రూస్ ఎల్. పేయిస్‌నర్ వెల్లడించారు. టెలివిజన్ రంగంలో ఎమ్మీ అవార్డులను ఆస్కార్‌తో పోలుస్తారు. భారతీయ టెలివిజన్ రంగంలో తనదైన ముద్రవేసిన ఏక్తాకపూర్ ఈ అవార్డు అందుకోనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ గుర్తింపును పొందడం పట్ల ఎంతో వినమ్రతగా, ఉత్సాహంగా ఉన్నట్లు ఏక్తాకపూర్ వెల్లడించారు.
‘‘తన హృదయంలో ఈ అవార్డుకు ప్రత్యేక స్థానముంటుంది. ఈ గుర్తింపు రావడం నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇది పనికి మించిన ప్రయాణాన్ని సూచిస్తోంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఇది కీలకమైన అంశం. ఎంతో పేరున్న ఈ వేదికపై నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మహిళల కోసం విభిన్నమైన కథలు సృష్టించడంలో నాకు టెలివిజన్ ఒక సాధనంగా దొరికింది. అంతర్జాతీయ స్థాయిలో మహిళలకు, నా సహచరులకు ప్రాతినిధ్యం వహించేలా ఈ అవార్డు నాకు గుర్తింపు ఇవ్వనుంది. ఎమ్మీకి ధన్యవాదాలు’’ అని ఏక్తాకపూర్ పోస్టు చేశారు.
‘‘టెలివిజన్, ఓటీటీ వేదికల్లో భారత్, దక్షిణాసియాల్లో వీక్షకులను ఆకట్టుకునే ఎన్నో సిరీస్‌లు చేస్తూ టెలివిజన్ కంటెంట్ పరిశ్రమలో అగ్రగ్రామిగా నిలిచేలా ఏక్తాకపూర్ బాలాజీ టెలీఫిల్మ్‌ను నిర్మించారు. టెలివిజన్ రంగంలో ఎదిగిన తీరు, ఆమె ప్రభావాన్ని గుర్తించి డైరెక్టరేట్ అవార్డుతో గౌరవించాలని ఎదురుచూస్తున్నాం’’ అని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్, సైన్స్ అధ్యక్షుడు, సీఈవో బ్రూస్ ఎల్. పేయిస్‌నర్ వెల్లడించారు.
ఇండియన్ టెలివిజన్ క్వీన్‌గా పేరున్న ఏక్తాకపూర్ ప్రస్తుతం దక్షిణాసియాలో అతిపెద్ద కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 1994లో ఏక్తాకపూర్ తన తల్లిదండ్రులు జితేంద్ర కపూర్, శోభోకపూర్‌తో కలిసి బాలాజీ టెలీఫిల్మ్‌ను నెలకొల్పారు. అప్పటి నుంచి ఎన్నో ప్రముఖ టీవీ షోలను నిర్మించారు. బాలాజీ బ్యానర్‌పై ఇప్పటివరకు 17,000 గంటలకు పైగా టీవీ షోల కంటెంట్‌ను రూపొందించారు. 45 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఏక్తాకపూర్ నిర్మించిన టీవీ షోల్లో ‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’, ‘కహఘర్ ఘర్‌కీ’, ‘కసౌథీ జిందగీకే’, ‘బడే అచ్చే లగ్తే హేన్’ వంటి ఎంతో పేరుగాంచినవి ఉన్నాయి.