భారతదేశం కర్మభూమి. సనాతన ధర్మంలో అనేక రహస్యాలు. దేశంలో నిర్మించిన దేవాలయాల్లో అనేక శాస్త్ర సాంకేతిక అంశాలు ఉన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే జాగ్రఫీలోని అక్షాంశాలు, రేఖాంశాలు, రేఖలతో కూడిన జామెట్రీ కూడా దాగి ఉంది. అదే కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు కొలువై ఉన్న ఆలయాల్లో 8పరమేశ్వరుని ఆలయాలు “79 డిగ్రీల ఒకే రేఖాంశం మీద ఉండటం. వీటిలో ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలకు ప్రాతినిధ్యం వహించే పంచ భూత దేవాలయాలు ఉండటం మరొక్క విశేషం. ఇలా ఒకే రేఖాంశం మీద ఉన్న ఆలయ విశేషాలను తెలుసుకుందాం.
కేదార్‌నాథ్ ఆలయం, కేదార్‌నాథ్
కేదార్ నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగలో పరమ శివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈ ఆలయం 79 డిగ్రీల రేఖాంశంలో కొలువైన మొదటి ఆలయం. అంతే కాదు ఈ ప్రదేశం ద్వాదశ జ్యోతిర్లింగల్లో ఒక్కటి. సముద్రమట్టానికి 3584మీటర్ల ఎత్తులో హిమాలయాలలో ఉంటుంది. కేదార్ నాథ్ ఆలయం ఆది శంకరులచే 8వ శతాబ్దంలో పేనర్ నిర్మించబడిన శివాలయం.
కాలేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం
పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమ కలది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకే సరళ రేఖాంశంలో కొలువైన ఉన్న ఆలయాల్లో ఇది రెండోవది. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం విశేషం. కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉన్న ఆలయం కాళేశ్వరం.
శ్రీకాళహస్తి ఆలయం, శ్రీకాళహస్తి
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈ మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది. పంచ భూతాల్లో ఒకటైన వాయుకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆలయం 79 డిగ్రీల రేఖాంశంలో కొలువై ఉన్న మూడో ఆలయం శ్రీకాళహస్తి. ఈ దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. దక్షిణకాశీగా పేరొందిన ఈ ఆలయంలో స్వామి వారి ఎదురుగా ఉండే దీపం రెపరెపలాడుతూ కనిపిస్తుంది. స్వామి ఉఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు.
ఏకాంబరేశ్వర ఆలయం, కాంచీపురం
తమిళ నాడులోని కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం ఒకే రేఖాంశంలో కొలువై ఉన్న నాలుగో ఆలయం. ఈ ఆలయం పంచభూతాల్లో ఒక్కటైన భూమిని సూచిస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద గాలి గోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ శివుడు మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది.
జంబుకేశ్వర ఆలయం, తిరువనైకవల్
79 డిగ్రీల రేఖాంశంలో కొలువై ఉన్న ఆలయాల్లో ఐదో ఆలయం జంబుకేశ్వరాలయం. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వలన, ఏనుగుల చేత పూజలందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది. ఇక్కడి శివ లింగం పంచభూతాల్లో ఒక్కటైన జలానికి ప్రతీక. జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది.
అరుణాచలేశ్వరాలయం, తిరువన్నమలై
ఒకే రేఖాంశంలో కొలువై ఉన్న ఆలయాల్లో ఆరో దేవాలయం అరుణాచలేశ్వరాలయం. తమిళనాడులోని తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వరాలయం పంచలింగ క్షేత్రాలలో ‘అగ్ని’ భూతలింగానికి ప్రతీక. తేజోలింగం కనుక దీన్ని అగ్ని క్షేత్రం అంటారు.వేద, పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దానిచుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.
నటరాజ ఆలయం, చిదంబరం
ఒకే సరళ రేఖాంశంలో కొలువై ఉన్న ఆలయాల్లో ఏడో ఆలయం చిదంబరంలోని నటరాజ ఆలయం. తమిళనాడులోని కడలూరు జిల్లాలో చిదంబరం పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు.ఇంక ఇక్కడ మూడో రూపం ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర రూపం.
రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం
79 డిగ్రీల సరళ రేఖాంశంలో కొలువైన ఆలయాల్లో చివరి ఆలయం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని పవిత్ర నగరమైన రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులు, వైష్ణవులు స్మార్తాలకు పవిత్ర తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో కొలువైన పరమ శివుని “రామనాథస్వామి”గా కొలుస్తారు.