ప్రపంచంలోనే అపురూప కట్టడం అయిన ఫ్రాన్స్ లోని ఈఫిల్ టవర్ కు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం ఈఫిల్ టవర్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఫోన్ ద్వారా ఈఫిల్ టవర్ పై బాంబు దాడి చేస్తామని వచ్చిన బెదిరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు ఈఫిల్ టవర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రదేశంలోకి ఎవరూ రాకుండా దిగ్బంధించారు. టవర్ కు వెళ్ళే వీధులను, సీన్ నది మీదుగా ట్రోకాడెరో ప్లాజా వరకూ విస్తరించి ఉన్న వంతెనను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈఫిల్ టవర్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలను నిర్వహించారు. టవర్ లోపల ఎవరైనా ఉన్నారా ? అన్న కోణంలో పోలీసులు సంఘటన స్థలంలో తనిఖీలు చేపట్టారు. ఈఫిల్ టవర్ ప్రతిరోజు తెరిచి ఉండాల్సి ఉండగా, బాంబు బెదిరింపులతో, ఆత్మహత్య బెదిరింపులు, కార్మికుల ఆందోళనలతో అప్పుడప్పుడు మూత పడుతుంది. తాజాగా గుర్తు తెలియని ఆగంతుకుల నుండి వచ్చిన ఫోన్ బెదిరింపు కారణంగా ఈఫిల్ టవర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరిగిందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ప్యారిస్ యొక్క అర్రాన్ డిస్మెంట్లో, ఈఫిల్ టవర్ కు వెళ్ళే రహదారులు మూసివేయబడ్డాయి అని, ప్రజలు ఈ ప్రాంతంలో తిరగడాన్ని ప్రస్తుతానికి నిషేధించామని అధికారులు చెబుతున్నారు. ఈఫిల్ టవర్ చుట్టుపక్కల తనిఖీలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఈఫిల్ టవర్ మూసివేయబడిందని ,ముందస్తు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేశామని, తిరిగి ఎప్పుడు తెరుచుకుంటుంది అన్నదానిపై నోటీసు ఇస్తామని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి తనకు తాను ఆత్మాహుతి దాడికి పాల్పడతానని ఫోన్ చేసిన నేపథ్యంలోనే పారిస్ పోలీసులు అలర్ట్ అయ్యారు.
తమకు ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది ? ఈఫిల్ టవర్ పరిసర ప్రాంతాలలో నిజంగానే ఎవరైనా ఆగంతకులు ఉన్నారా? ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్స్ గర్వకారణమైన నిర్మాణం కాపాడుకోవడమెలా? అన్న అంశాలపై దృష్టి పెట్టిన ప్యారిస్ పోలీసులు బిజీగా ఉన్నారు. ఐరన్ లేడీ గా పిలవబడే ఈఫిల్ టవర్ కు సంవత్సరానికి ఆరు మిలియన్ల మంది సందర్శకులు వస్తారని తెలుస్తుంది.131 సంవత్సరాల పురాతనమైన ఈ టవర్ ను సాధారణంగా రోజుకు 25 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారు. కరోనా వైరస్ నిబంధనల నేపథ్యంలో ఈ సంవత్సరం ఈఫిల్ టవర్ సందర్శన గణనీయంగా తగ్గింది. ఇప్పటికే పలు మార్లు ఈఫిల్ టవర్ భద్రతకు సంబంధించి ఫేక్ కాల్స్ వచ్చాయని, 2018లో టెర్రర్ బెదిరింపుల నుండి రక్షించడానికి బులెట్ ప్రూఫ్ గ్లాస్ తో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈఫిల్ టవర్ పై దాడికి పాల్పడతామని గతంలో బెదిరించిన ఉగ్రవాద సంస్థలలో అల్ ఖైదా , ఐసిస్ ఉన్నట్లుగా సమాచారం.