ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కోర్టులో షాక్ తగిలింది. జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పు వెలురించింది. ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. అంతేగాక, రూ. 5000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా విధించింది. చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు జయప్రద. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్ పనులు చూసుకునేవారు. మొదట బాగా లాభాలు వచ్చినా.. తర్వాత రాబడి తగ్గడంతో చివరకు థియేటర్ మూసేశారు.
అయితే, ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. థియేటర్ మూసివేయడంతో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. వాటిని కార్మికులకు అందజేయలేదు. దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని కోర్టుకు తెలిపింది. దీన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో జయప్రద తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టివేసింది. అయితే, ఆమె వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని చెప్పినా కోర్టు అంగీకరించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ కోర్టు జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ. 5వేల జరిమానా విధించింది. కాగా, జయప్రద.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, తదితర అలనాటి హీరోలతో కలిసి పలు తెలుగు సినిమాల్లో నటించారు. తన సొంతూరు రాజమండ్రి అని చెప్పుకునే జయప్రద.. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీతోపాటు పలు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించారు. ప్రస్తుతం జయప్రద డ్రామా జూనియర్ అనే టీవీ ప్రొగ్రాంలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు.