ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నెలల తరబడి కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్- రష్యా మద్య యుద్ధం దెబ్బకు ఇరు దేశాల్లో చాలా కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలతో చాలా కంపెనీలు మూతపడ్డాయి. తాజాగా మరో కంపెనీ తమ రష్యా వ్యాపారాన్ని విక్రయించేసింది. ఈ యుద్ధం దెబ్బకు ఓ డచ్ బ్రూవరీ తన వ్యాపార విభాగాన్ని కేవలం 1 యూరోకు అంటే భారత కరెన్సీలో రూ.89.19కే అమ్మేసింది. డచ్‌కు చెందిన హైనకెన్ అనే సంస్థ రష్యాలోని తన వ్యాపారాన్ని అమ్మేసి అక్కడి నుంచి బయటపడింది.
గత 18 నెలల నుంచి ఈ సంస్థ రష్యా నుంచి వైదొలగాలనే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో చేసేది ఏమీ లేక తాజాగా రష్యాలో తన వ్యాపారాన్ని కేవలం 1 యూరోకు ఆ దేశ దిగ్గజ సంస్థ ఆర్నెస్ట్ గ్రూప్‌నకు విక్రయించినట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో తమ కంపెనీకి దాదాపు 325 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 2.6 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం మొదలై 18 నెలలు గడుస్తున్నా హైనకెన్ సంస్థ రష్యా నుంచి బయటకు రావడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. కానీ, అక్కడి స్థానిక ఉద్యోగులను చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆ కంపెనీ వెల్లడించింది. తాము రష్యా నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది మార్చి, 2022లోనే హైనకెన్ ప్రకటించింది. అక్కడ వ్యాపారం చేయడం ఏ మాత్రం లాభదాయకం కాదని పేర్కొంది. కానీ, జాగ్రత్తగా మరో సంస్థకు అక్కడి వ్యాపారాన్ని బదిలీ చేసి బయటకు రావాల్సి ఉందని తెలిపింది. అందుకు తాము అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టిందని, ఈ డీల్ తమ ఉద్యోగుల జీవనాధారాన్ని కాపాడిందని హైనకేన్ పేర్కొంది. బాధ్యతాయుతంగా తాము రష్యా నుంచి వైదొలగేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు హైనకెన్ సీఈఓ డోల్ఫ్ వాన్‌డెన్ బ్రింక్.
ఈ డీల్ కింద రష్యాలో హైనకెన్‌కు ఉన్న బ్రూవరీలు, ఇతర ఆస్తులు చేతులు మారతాయి. దాదాపు 1800 మంది స్థానిక ఉద్యోగులను మూడేళ్ల పాటు కొనసాగిస్తామని ఆర్నెస్ట్ హామీ ఇచ్చింది. ఈ సేల్‌లో మొత్తం 7 హైనకెన్ బ్రూవరీస్ ఉన్నాయి. మరోవైపు.. హైనకెన్ బ్రాండ్ బీర్ రష్యన్ మార్కెట్ నుంచి గత ఏడాదే బయటకు వచ్చేసింది. తమ బ్రాండ్లలోని మరోకటి అమ్‌స్టెల్ సైతం మరో 6 నెలల్లో విడతల వారీగా విక్రయాలు ఆపేయనుందని కంపెనీ తెలిపింది.