గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ(Double Bed Room Houses) చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయింది. ఇప్పటికే రెండు విడతల్లో లబ్దిదారులకు ఇళ్లు అందించిన సర్కారు మూడో విడతలో భాగంగా ఇవాళ మరికొన్ని ఇళ్లు అందించనుంది. మొత్తం 36వేల 884 మందిని ఎంపిక చేయగా.. ఇవాళ 19వేల 20మందికి మిగిలిన వారికి ఈనెల 5న పంపిణీ చేయనున్నారు. నగరంలోని 9 ప్రాంతాల్లో హరీశ్‌రావు(harish rao), తలసాని(talasani srinivas yadav) సహా ఇతర మంత్రులు రెండు పడక గదులు ఇళ్లు అందించనున్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మూడో విడత ఎంపికైన లబ్దిదారులకు డబుల్‌బెడ్ రూం ఇళ్ల(Double Bed Room Houses)ను పంపిణి చేయనున్నారు. మూడో విడతలో మిగిలిన వాటిని ఈ నెల 5 తేదీలలో పంపిణి చేస్తారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రూ.9,600 కోట్ల వ్యయంతో గ్రేటర్ పరిధిలో ఎంతో విలువైన స్థలాల్లో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఎంతో పారదర్శకంగా, రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి పంపిణి చేస్తున్నారు.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్‌లో హోంమంత్రి మహమూద్ అలీ 3,142 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణి చేయనున్నారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్‌పల్లిలో మైనింగ్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 1361 మంది లబ్ధిదారులకు, మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్ సాన్పల్లిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి(Minister Sabita Indra Reddy) 2099 మందికు అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్లో 472 మందికి పంపిణి చేస్తారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగొండలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్(Deputy Speaker Padma Rao Goud) 344 మంది లబ్దిదారులకు.. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 356 మందికి.. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు -2లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) 6067 మంది లబ్దిదారులకు ఇళ్లను పంపిణి చేస్తారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అహ్మద్ గూడలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1965 మంది లబ్దిదారులకు.. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని రాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 3214 మందికు ఇళ్లను పంపిణి చేయనున్నారు.