వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేసుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న ఆయనకు మరిన్ని కేసులు చుట్టుకుంటున్నాయి. తాజాగా 2020 నాటి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ట్రంప్‌పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ఆదేశాలు చేశారు. గత ఎన్నికల్లో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా యూఎస్ కాంగ్రెస్ ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు.
ఈ కేసులో ట్రంప్‌పై దర్యాప్తు చేపట్టాలని వాషింగ్టన్ స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ మంగళవారం ఆదేశించారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న అవాస్తవ ఆరోపణల ఆధారంగా ట్రంప్ తమపై ఒత్తిడి తీసుకొచ్చారని కొందరు అధికారులు న్యాయస్థానం ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్‌ను ఆపేందుకు 2021 జనవరిలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో మాజీ అధ్యక్షుడిపై నేరాభియోగాలు నమోదయ్యాయి. గురువారం ఆయన న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
2021 జనవరి 6న ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించిన ప్రసంగించిన కొద్ది గంటలకే అమెరికా క్యాపిటల్ భవనంపై భీకర దాడి జరిగిన విషయం తెలిసిందే. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశమైన వేళ.. వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు భవనంలోకి దూసుకెళ్లారు. ఆ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, తాజా నేరాభియోగాలను ట్రంప్ తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే డెమోక్రాట్లు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించారు.
2024 అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ముందంజలో ఉన్న ట్రంప్‌పై ఇలా వరుసగా కేసులు నమోదవ్వడం గమనార్హం. ఇప్పటికే ఓ శృంగార తారకు డబ్బుల చెల్లింపు కేసులో, శ్వేతసౌధం రహస్య పత్రాలను తరలించిన కేసులో ఆయనపై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇక, జార్జియాలోనూ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై స్థానిక న్యాయస్థానంలో కేసు నమోదైంది.