తెలంగాణలోని మహబూబాబాద్(Mahbubabad) జిల్లాలో మూడేళ్ల క్రితం జరిగిన కుసుమ దీక్షిత్ రెడ్డి(Kusuma Dixit Reddy) అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు(District Court) సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు మంద సాగర్‌కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ దేవత, పోలీసుల చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లాలో 2020 అక్టోబర్‌లో జర్నలిస్ట్ కుసుమ వసంత, రంజిత్ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్ రెడ్డి హత్యకు గురయ్యాడు.
స్థానికంగా పంచర్ షాప్ నిర్వహించే మంద సాగర్(Manda Sagar) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా మహబూబాబాద్ జిల్లా కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది. మూడేళ్ల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మందసాగర్.. కేసముద్రం మండలం అన్నారం(Annaram) గ్రామ శివారులోని దానమయ్య గుట్టపై హత్యచేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఆ తర్వాత అదే రోజు రాత్రి దీక్షిత్ రెడ్డి తండ్రి రంజిత్ రెడ్డికి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ చేసి రూ.45 లక్షలు డిమాండ్ చేశాడు. రంజిత్ రెడ్డి ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల తర్వాత దానమయ్య గుట్టపై దీక్షిత్ మృతదేహాన్ని కనిపెట్టారు. నిందితుడు మంద సాగర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.