గతకొన్ని రోజులుగా తిరుమలలో చిరుత పులి సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన సంగతి తెలిసిందే. తాజగా తిరుమల నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. గతంలో బాలిక పై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కడం గమనించదగ్గ విషయం. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనుమానాస్పద ప్రదేశాల్లో బోన్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చిరుతను బంధించేందుకు మూడు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. మోకాలి మిట్ట, లక్షీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులను ఏర్పాటు చేయడం జరిగింది. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించడం గమనార్హం.
తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను వారు ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని భూమన తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులు తున్నామని పలువురు అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను మేము ఖండిస్తున్నాం. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం’’ అని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవడమే తమ బాధ్యతని వారు అన్నారు.