మనలో చాలా మంది తిన్న తర్వాత స్వీట్లు తింటేనే వారికి తిన్నట్టు ఉంటుంది. అలాగే ఫంక్షన్లో స్వీట్ తప్పకుండా ఉంటుంది. ప్రతి వేడుకలో స్వీట్లు తినడనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే భోజనం తిన్నాక స్వీట్ తినడం వలన మన ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
అధికంగా స్వీట్లు పంచదారతో తయారు చేసినవి ఉంటాయి. పంచదార అనేది ప్రాసెస్డ్ ఫుడ్, అంటే అధికంగా శుద్ధి చేసిన పదార్థం. ఇలా అధికంగా శుద్ధిచేసిన ఆహారాలు ఏవీ మంచివి కాదు. ముఖ్యంగా అధికంగా శుద్ధి చేసిన పంచదారతో చేసిన స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ తిన్నాక భోజనం చేసినా, భోజనం చేశాక స్వీటు తిన్నా అది వారి ఆరోగ్యం పై చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే భోజనంలో ప్రధానంగా బియ్యంతో చేసిన రకరకాల పదార్థాలు ఉంటాయి. బిర్యాని, ఫ్రైడ్ రైస్, తెల్ల అన్నం ఇవన్నీ విందులో భాగంగా తింటారు. అన్నంలో సహ జంగానే చక్కెర అధికంగా ఉంటుంది. ఆ షుగర్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇక స్వీటు తింటే ఆ చక్కెర స్థాయిలు మరింతగా పెరిగిపోతాయి. ఇలా శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరగడం మంచిది కాదు, కాబట్టి ఎవరైనా కూడా భోజనం సమయంలో స్వీట్లు దూరం పెట్టడమే మంచిది. స్వీటు తిన్నాక ఒక గంట వరకు ఆహారాన్ని తినకూడదు లేదా భోజనం చేశాక కనీసం రెండు గంటలు గ్యాప్ ఇచ్చి స్వీట్ తినడం మంచిది. మీకు స్వీట్ తినే ఆలోచన వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరీ ఉండ లేకపోతే చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి లేదా చిన్న బెల్లం ముక్క తినండి. కాసేపు ఇటూ అటూ నడవండి. ఇలా చేయడం వల్ల స్వీట్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే శరీరంపై ఎంతో ప్రభావం పడుతుంది. స్వీట్ తినడం వల్ల శరీరానికి ఉత్సాహం, చురుకుదనం రావు. పైగా తగ్గిపోతాయి. ఇలా దీర్ఘకాలంగా భోజనంతో పాటు స్వీట్లు తినడం వల్ల కొన్ని నెలలకు డయాబెటిస్ బారిన పడే అవకాశం పెరుగుతుంది. అలాగే వారిలో మూడ్ స్వింగ్స్ కూడా అధికంగా ఉంటాయి. బరువు త్వరగా పెరుగుతారు. చీటికిమాటికి చిరాకు పడుతూ ఉంటారు. పంచదారతో చేసిన ఆహారం అధికంగా తినడం వల్ల మానసికంగా ఎంతో ప్రభావం పడుతుంది. ప్రతి చిన్నదానికి కోపగించుకుంటారు. అసహనం ఎక్కువైపోతుంది. ఒత్తిడిగా అనిపిస్తుంది. ఓపిక తగ్గిపోతుంది. కాబట్టి నాలిక రుచి కోసం స్వీట్లు తింటే శరీరపరంగా అనారోగ్యమే. కాబట్టి స్వీట్ ను పూర్తిగా పక్కన పెట్టడం ఎంతో ఉత్తమం. బెల్లంతో చేసిన స్వీట్లు, డార్క్ చాక్లెట్ వంటివి పంచదారకు బదులు భర్తీ చేసుకుంటే ఆరోగ్యకరం.