పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ ఇంకా సినిమాలలోకి రాకముందే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే అకీరాకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తన కుమారుడికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తూ ఉంటారు. ఇక అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ నటించిన ఏవైనా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తప్పకుండా ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో సందడి చేస్తూ ఉంటారు. ఇలా అకిరా నందన్ ఇండస్ట్రీలోకి రాకముందే భారీగానే అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక చిన్న వయసులోనే ఈయన హీరో కటౌట్ కి ఏ మాత్రం తీసిపోరని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్ (ట్విటర్) వేదికగా ఫొటో షేర్ చేసిన రాఘవేంద్రరావు.. మెగా అభిమానులకు పండగలాంటి వార్త కూడా చెప్పారు. ఆయన మనవడు కార్తికేయ, అకీరాతో దిగిన ఫొటో పంచుకున్న దర్శకేంద్రుడు.. ‘‘నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు. నా మనవడు కార్తికేయ, పవన్ కుమారుడు అకీరా నందన్.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు’’ అని రాశారు. అయితే ఈ ట్వీట్‌ను ఆయన కొద్ది సేపటికే తొలగించడం గమనార్హం. కానీ అప్పటికే ఈ ఫొటో వైరలైంది. దీంతో అభిమానులంతా మరికొద్దిరోజుల్లో అకీరాను బిగ్ స్క్రీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ.. ఫొటోను షేర్ చేస్తున్నారు.
దీనిపై రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాలో స్పందించారు. ‘‘ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఏదైనా పోస్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించిన ఊహాగానాలు ఆపేయండి. ఒకవేళ అకీరా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని నేను మీతో కచ్చితంగా పంచుకుంటాను’’ అని అన్నారు. అలాగే రాఘవేంద్రరావుతో తాను దిగిన ఫొటోను కూడా రేణూ దేశాయ్ పంచుకున్నారు.