జాతీయ కాంగ్రెస్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్ఠానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 33% సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చారని అన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే మా డిమాండ్‌ను కూడా వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యం అన్నారు. ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన అన్నారు. రాజ్యంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలి. దానికి చిత్తశుద్ధితో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. నేను ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపాను. కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదు. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు.