మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఎక్కడా లేని ఉత్సాహం తన్నుకువస్తుంది. ధోని ఆడుతున్నాడంటే చాలు స్టేడియాలన్నీ అతని నామ జపంతో మార్మోగిపోతాయి. ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వచ్చినా, వికెట్ల వెనకాల నిల్చున్న, బ్యాట్‌తో సిక్సర్లు బాదినా, తన స్టంపింగ్‌తో వికెట్లను గిరాటేసిన స్టేడియంలో అభిమానుల అరుపులకు అలపు ఉండదు. అది ఒక్క స్టేడియం వరకే పరిమితమవుతుందనుకుంటే పొరపాటే. టీవీలకు, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు ధోని ఆట చూడడానికి అభిమానులు అతుక్కుపోతారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓటీటీలో బద్దలైన లైవ్ వ్యూయర్‌షిప్ రికార్డులే ఇందుకు నిదర్శనం. ధోనికున్న అభిమాన ఘనం గురించి చెప్పుకోవాలంటే ఓ రోజైనా సరిపోదు. ధోని అభిమానులకు ప్రాంతాలతో, కులాలతో, మతాలతో సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని అభిమానులు ఉన్నారు.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ మహేంద్రుడిగా భారీగా అభిమానులున్నారు. దీంతో పుట్టిన రోజు సందర్భంగా ధోనికి తెలుగు రాష్ట్రాల అభిమానులు భారీ బహుమతి ఇవ్వబోతున్నారు. అమోఘమైన అభిమాన ఘనం ఉన్న ధోని శుక్రవారం నాడు 42వ ఏట అడుగుపెడుతున్నాడు. దీంతో ధోని పుట్టిన రోజు వేడుకల కోసం అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ధోని భారీ కటౌట్లను ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 52 అడుగుల ధోని భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. ఈ కటౌట్‌ను ధోని పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారంనాడు ఆవిష్కరించనున్నారు. అలాగే భారీ కేక్‌ను కట్ చేయనున్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వస్తున్న ఫోజ్‌తో కటౌట్‌ను తయారు చేశారు. ఈ కటౌట్‌పై తెలుగు ఎంఎస్ఆడియన్స్ అనే స్టిక్కర్ కూడా వేశారు.
ఇక విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ 44వ జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు 77 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి ధోనీపై ఉన్న అభిమానం చాటుకున్నారు. గతేడాది కూడా ధోనీ పుట్టిన రోజు సందర్భంగా అదే ప్రాంతంలో సుమారు 44 అడుగల ఎత్తులో ధోనీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సారి 100 అడుగుల ఎత్తులతో కటౌట్ ఏర్పాటు చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ .. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 77 అడుగులకే పరిమితమయ్యారు. ఈ భారీ కటౌట్ జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు, వాహన చోదకులను ఆకట్టుకుంటోంది.