తెలంగాణలోని వినయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే ఖైరతాబాద్ మహాగణపతిని (Khairatabad Ganesh) దర్శించుకునేందుకు భారీగా భక్తులు (devotees)తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే లంబోదరుడిని దర్శించుకుంటున్నారు. దీంతో బడా గణేశ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖైరతాబాద్(Khairatabad) మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, టెలిఫోన్ భవన్ వైపు నుంచి వచ్చేవారికి.. పోలీసులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోనే భక్తులను అనుమతిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.
ఈనెల 28న గణేశ్ నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు వచ్చే ఆదివారం కావడంతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు. పర్యావరణ హితం కోసం మట్టితో చేసిన ఈ మహాగణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు.. వెడల్పు 28 అడుగులుగా ఏర్పాటుచేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి.