రోజురోజుకూ టెక్నాలజీ కొత్త రంగులు పులుముకుంటుంది. మార్కెట్‌లో ఆధునిక ఉత్పత్తులు వస్తుండటంతో పాత ఉత్పత్తులకు టాటా చెప్పేస్తున్నారు. నేడు ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ మన కోసం ఎన్నో పనులు చేస్తోంది. టెక్నాలజీ ఆధునికంగా మారడంతో గ్యాడ్జెట్‌లు కూడా స్మార్ట్‌గా మారాయి. మరి ఇపుడు ఎక్కడ నుంచి అయినా పని చేసుకునే విధంగా ఉన్న ల్యాప్ టాప్‌లు అసలు ఎప్పుడు ఎక్కడ మొదలయయ్యో చదివేయండి.
ప్రపంచంలోని మొట్టమొదటి ల్యాప్‌టాప్ 1981లో తయారు అయింది, దీనిని ఓస్బోర్న్ కంప్యూటర్ కార్పొరేషన్ తయారు చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఆ సమయంలో పోర్టబుల్ మైక్రో కంప్యూటర్‌గా ఉండేది. ఈ ల్యాప్‌టాప్ బరువు 11 కిలోలు ఉండగా, ఐదు అంగుళాల స్క్రీన్ కలిగి ఉండేది. అధిక బరువు, అధిక ధర కారణంగా ఇది పెద్దగా విజయవంతం కాలేదు. ఈ మొదటి పోర్టబుల్ ల్యాప్‌టాప్ ధర 1795 డాలర్లు అంటే నేటి రూపాయి విలువ ప్రకారం రూ.1,46,775. ఓస్బోర్న్ ల్యాప్‌టాప్ తర్వాత రెండో పోర్టబుల్ ల్యాప్‌టాప్ 1983లో లాంచ్ అయ్యాయి. దీనికి గ్రిడ్ కంపాస్ 1101 అని పేరు పెట్టారు. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇది మార్కెట్‌లో విజయవంతం కాలేదు. దీని తర్వాత Compaq LTE, Compaq LTE 286 ల్యాప్‌టాప్‌లు 1990లో మార్కెట్లోకి వచ్చాయి. పాత ల్యాప్‌టాప్‌ల కంటే ఇవి చాలా తేలికైనవి.
యాపిల్ మొదటి ల్యాప్‌టాప్ 1989లో
యాపిల్ కంపెనీ ఉత్పత్తులు నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. యాపిల్ తన మొదటి ల్యాప్‌టాప్‌ను 1989లో లాంచ్ చేసింది. నేడు వస్తున్న Apple ల్యాప్‌టాప్‌లు తేలికగా, చిన్నవిగా ఉన్నాయి. ఆ సమయంలో యాపిల్ ల్యాప్‌టాప్ ఇప్పటి వెర్షన్ కంటే చాలా పెద్దది, భారీగా ఉంది. దాని బ్యాటరీ, స్క్రీన్ ఇతర ల్యాప్‌టాప్‌ల కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. దీని తరువాత యాపిల్ 1991లో పవర్ బుక్ ల్యాప్‌టాప్ సిరీస్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీ మూడు ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో పవర్ బుక్ 100, పవర్ బుక్ 140, పవర్ బుక్ 170 ఉన్నాయి.