రాజ్యసభలో మరో ఎంపీపై వేటు పడింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రియెన్ ను రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించినందుకు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సస్పెండ్ చేశారు. ఈ సీజన్ పార్లమెంట్ సమావేశాల మొత్తానికి డెరెక్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జగదీప్ ప్రకటించారు.
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓబ్రియెన్ తీరుపై ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పబ్లిసిటీ కోసం ఆయన సభలో నాటకీయంగా వ్యవహరిస్తున్నారని ధన్‌ఖడ్ ఫైర్ అయ్యారు. ఓబ్రియెన్ ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించారు. ఈ క్రమంలోనే ఓబ్రియెన్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలని రాజ్యసభా పక్ష నేత పీయూష్ గోయల్ మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘ఆ టీఎంసీ ఎంపీ సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారు. ఛైర్మన్‌ను అగౌరవపరుస్తున్నారు’’ అని తీర్మానంలో పేర్కొన్నారు.
దీనిపై నేడు ఓటింగ్ జరిపిన ఛైర్మన్.. ఓబ్రియెన్‌ను ఈ సీజన్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.