తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై అభ్యర్థుల్లో అనుక్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రూప్ -2 పరీక్షనువాయిదా వేయాలని వినతులు రావడంతో ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టం చేసింది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషన్ వివరించింది. ఈనెల 29, 30న జరగాల్సిన గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో జస్టిస్ పి.మాధవీదేవి విచారణ జరిపారు. ఆగస్టు నెలలో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్‌తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గిరిధర్ రావు, నర్సింగ్ కోర్టుకు వివరించారు. ‘‘గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు చాలా ముఖ్యమైనవి. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని జూన్‌లోనే వినతిపత్రం ఇచ్చినప్పటికీ.. టీఎస్‌పీఎస్సీ స్పందించ లేదు. నియామక పరీక్ష నిర్వహణ ప్రధాన ఉద్దేశం నెరవేరేలా కమిషన్ వ్యవహరించడం లేదు’’ అని కోర్టుకు తెలిపారు.
అయితే, గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్ రావు కోర్టుకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని.. ఆ కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందన్నారు. గ్రూప్-2కి ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. వారిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది సుమారు 60వేల మంది అభ్యర్థులేనని చెప్పారు.
వాదనలు విన్న ధర్మాసనం స్పందిస్తూ.. గురుకుల పరీక్షలు రాస్తున్నది కొంత మంది అభ్యర్థులే అయినా వారికీ అవకాశం ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. లక్షల మంది దరఖాస్తుదారుల్లో పిటిషన్ వేసింది 150 మందేనని టీఎస్‌పీఎస్సీ పేర్కొనగా.. కోర్టుకు అందరూ రాలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపై నిర్ణయం ఈ నెల 16వ తేదీ లోపు చెబుతామని కమిషన్ తరఫు న్యాయవాది చెప్పగా.. చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నందున 14నే చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు.