ఎత్తయిన భవనాలు ఎక్కుతూ.. ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు చేయడంలో దిట్టగా పేరుగాంచిన ఫ్రెంచ్ డేర్‌డెవిల్ రెమి లుసిడి (30) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రమాదాలతో చెలగాటమాడే ఈ 30 ఏళ్ల లుసిడి.. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్‌లోని ది ట్రెగెంటర్ టవర్ కాంప్లెక్స్‌ను ఎక్కే క్రమంలో 68వ అంతస్తు వద్ద పట్టు తప్పి కిందపడి మరణించాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. భవనాన్ని అధిరోహిస్తూ 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్ కిటికీ బయట చిక్కుకుపోయాడు. దీంతో భయంతో అతడు కిటికీని బలంగా తన్నడంతో పట్టుతప్పి నేరుగా కిందపడి మరణించాడు.
హాంకాంగ్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. లుసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌కు చేరుకొని, 40వ అంతస్తులో తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డుకి చెప్పి, లోపలికి వెళ్లాడు. ఎంతకైనా మంచిది, ఒకసారి నిర్ధారించుకుందామని.. 40వ అంతస్తులో ఉండే వ్యక్తికి సెక్యూరిటీ గార్డు ఫోన్ చేశాడు. అయితే.. ఆ వ్యక్తి తనకు లుసిడి ఎవరో తెలియదని సెక్యూరిటీ గార్డుకి సమాధానం ఇచ్చాడు. అప్పటికే లుసిడి చాకచక్యంగా సెక్యూరిటీ కళ్లు గప్పి.. లోపలికి వెళ్లి, ఎలివేటర్‌లో దూరాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. 49వ అంతస్తులు మెట్లు ఎక్కుతూ లుసిడి కనిపించాడు. ఉదయం 7:38 సమయంలో.. లుసిడి పెంట్‌హౌస్ బయట కిటికీ తడుతూ.. ఒక పని మనిషికి కనిపించాడు. అతడ్ని చూసి ఖంగుతిన్న ఆమె.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.
మరోవైపు.. లుసిడి కాలు ఆ పెంట్‌హౌస్ కిటికీలో ఇరుక్కుంది. దాన్నుంచి బయటపడేందుకు అతడు బలంగా కాలితో కిటికీని తన్నాడు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి.. అతడు కిందకు పడ్డాడు. 68వ అంతస్తు నుంచి కిందపడటంతో.. అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లుసిడి మరణవార్త విని.. అతని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.