ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం అంత సులువేమి కాదు. అకడమిక్ అర్హతలతో పాటు ఉద్యోగం సాధించడానికి సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరం. వాటిలో ఒకటి క్రిటికల్ థింకింగ్. ఏదైనా విషయాన్ని పూర్తి స్థాయిలో అర్ధం చేసుకొని, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చే ఈ అంశం గురించి తెలుసుకోండి.
మనవద్దనున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఏదైనా అంశాన్ని లేదా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి తార్కికంగా డీల్ చేయడమే క్రిటికల్ థింకింగ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో ఇది కూడా ఒక భాగం.
క్రిటికల్ థింకింగ్ అనేది క్రియేటివ్ థింకింగ్ కంటే భిన్నమైనది. సృజనాత్మకతలో మనం ఏదైనా కొత్త అంశాన్ని కొత్తగా ఆలోచించి దేనైనా సృష్టించడం జరుగుతుంది. కానీ క్రిటికల్ థింకింగ్‌లో ఉన్న సమాచారాన్ని ఎంత సమర్థంగా అర్థం చేసుకున్నారు, దాని నుంచి ఎంతగా ఫలితాలనిచ్చే పరిష్కారాలు రాబట్టారు అనేది ప్రధానం.
ఈ క్రిటికల్ థింకింగ్‌లో పరిశీలన, విశ్లేషణ, వివరణ, ప్రతిబింబించడం, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకునే సామర్ధ్యం అవసరమవుతాయి.
ఆలోచనల మధ్య సంబంధాన్ని అర్ధం చేసుకోవడం, సమస్యల పరిష్కారానికి క్రమ పద్ధతి పాటించడం, ఆలోచనలు, నమ్మకాలు, వాస్తవాల మధ్య తేడాను కనిపెట్టడం, వాదన, ప్రతివాదనలు వినడం, రీజనింగ్‌లో లోపాలను గుర్తించడం ఈ థింకింగ్ ఉన్నవారు పాటించే నియమాలు.
ఈ థింకింగ్‌ని ఎలా పెంచుకోవాలి…
ఒక విషయాన్ని ఎక్కువ కోణాల్లో చూడటం సాధన చేయాలి. ఏ వాదనను అయినా సమర్ధించడానికి ముందు వాటి కారణాలు, రుజువులు బేరీజు వేసుకోవాలి.
కాస్త కష్టమైనా సరే.. మనం నమ్మేదంతా నిజం కాదనే విషయాన్ని ఒప్పుకోగలగాలి. సొంత అభిప్రాయాలను పక్కనపెట్టి పూర్తిగా లాజికల్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి.
ప్రశ్నించడం అనేది నేర్చుకోవడం ఈ క్రిటికల్ థింకింగ్‌లో తొలి మెట్టు. ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం, అలాగే ప్రశించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
క్రిటికల్ థింకింగ్‌ను నేర్చుకునేందుకు ఆన్‌లైన్‌లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి హాజరుకావడం ద్వారా దీన్ని మరింత సాధన చేయొచ్చు.