వేడుకల్లో ఆతిధ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అలంకారణ అంతే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఆహుతులను అలరించేలా అలంకరించడం అంత సులువైన పని ఏమి కాదు. ఈ పని నేర్పించేది ‘ఈవెంట్ డెకర్’ కోర్సు. వేడుక ఏదైనా.. కార్యక్రమానికి తగినట్లు వేదికను పరిసరాలను అలంకరించడం డెకరేటర్ పని. సృజనకు పట్టం కట్టే ఈ పనిలో క్రియేటీవ్‌గా ఆలోచించేవారికి అవకాశాలకు కొదవే లేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ కెరియర్లో ముఖ్యభాగమైన ‘ఈవెంట్ డెకార్’ ఇప్పుడు ప్రత్యేకమైన కెరియర్‌గా రూపుదిద్దుకొంటుంది. ఇంతటి డిమాండ్ ఉన్న కోర్సు వివరాలను మనమూ తెలుసుకుందాం.
ఏమి నేర్చుకుంటాం..
ఈవెంట్ డెకర్ కోర్సులో భాగంగా వేదిక, చుట్టూ పరిసరాలు అలంకరణలో ప్రతి చిన్న విషయాన్ని అభ్యర్థులు క్షుణ్ణంగా నేర్చుకుంటారు. ఈవెంట్‌కి తగినట్లు వేదిక ఎలా కనిపించాలి, ఎలాంటి థీమ్ ఎంచుకోవాలి, ఎటువంటి రంగులను ఎంచుకోవాలి, సందర్భాన్ని అనుసరించి రంగుల ఎంపిక వంటివి ముఖ్యంగా నేర్చుకుంటారు. అంతేగాక ఎంచుకున్న రంగులను ఎలా మిక్స్ – మ్యాచ్ – బ్యాలెన్స్ చేయాలి, అలంకరణలో పూల ప్రాధాన్యం – వాటిలో రకాలు- ఎంపిక, సీలింగ్ డెకరేషన్, లైటింగ్, బ్యాక్‌డ్రాప్స్, టేబుల్స్కేప్ డిజైనింగ్… ఇలా అన్నీ నేర్చుకుంటారు.
ఇందులోనూ మళ్ళీ బెలూన్ వర్క్, డ్రాపింగ్, ఫ్లోరల్ ఆర్ట్, కిడ్స్ థీమ్ పార్టీ డెకరేషన్, వెడ్డింగ్ డెకరేషన్ వంటివి ప్రత్యేకంగా విడివిడి కోర్సులు. ఈ పనిలో ముఖ్యంగా కావాల్సినదల్లా ప్రతిచిన్న విషయాన్నీ సూక్ష్మంగా పరిశీలించగలిగే నైపుణ్యం, ఏం చేస్తే అందంగా ఉంటుందని పసిగట్టే ఊహాశక్తి మాత్రమే.
కోర్సులు ఎలా ..?
సాధారణ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు దేశంలో అన్ని ప్రధాన విద్యాసంస్థల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అందులో అలంకరణను ఒక మాడ్యూల్‌గా విద్యార్థులు నేర్చుకుంటున్నారు. కానీ దీన్ని ప్రత్యేకంగా సాధన చేయడానికి మాత్రం ప్రస్తుతం అధికశాతం కోర్సులు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి.
మొత్తం కార్యక్రమాలన్నింటిలోనూ పెళ్లిళ్ల మార్కెట్ చాలా పెద్దది. వెడ్డింగ్ డిజైనింగ్ అండ్ డెకార్ సర్టిఫైడ్ డిప్లొమా కోర్సులు… ఆరు నెలల కాలవ్యవధితో దాదాపు లక్షరూపాయల ఫీజులతో లభిస్తున్నాయి. ఇవి డిజైనింగ్ గురించి మరింత లోతుగా నేర్పింగే ఎక్స్‌క్లూజివ్ కోర్సులు. ఇందులో పిచ్ ప్రెజెంటేషన్, ప్రొడక్షన్ అండ్ ఫ్యాబ్రికేషన్, బేసిక్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్, లేఅవుట్ – హ్యాండ్ స్కెచింగ్, డిజైనింగ్ విత్ సాప్ట్వేర్, కాస్టింగ్ అండ్ బడ్జెటింగ్ ఇలా అన్నీ నేర్చుకునే అవకాశం ఉంది. కనీసం ఇంటర్ విద్యార్హతతో ఈ కోర్సుల్లో చేరవచ్చు.
ఉద్యోగ అవకాశాలు
ఈ కోర్సులు చేసినవారికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలతోపాటు స్టార్‌హోటల్స్, డెకార్ అండ్ డిజైనింగ్ కంపెనీలు, వినోద పరిశ్రమలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. కొంత పని అనుభవం తర్వాత సొంతంగానూ ప్రాజెక్టులు నిర్వహించవచ్చు.