తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతునిస్తూ.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలోని కేశినేని భవన్‌లో దీక్ష చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..”ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబుని అర్ధరాత్రి అరెస్టు చేయటం దారుణం. అరెస్ట్ చేసి ఇన్ని రోజుల అవుతున్నా ఇంకా సీఐడీ వాళ్లు ఆధారాల కోసం వెతుక్కుంటున్నారు.’ అని అన్నారు.
‘రాష్ట్రంలో సీఐడీ పేరు మార్చుకుని.. జేపీఎస్ (జగన్ ప్రైవేట్ సైన్యం)గా పెట్టుకోవాలి. చంద్రబాబు అరెస్టు వెనక ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల హస్తం కచ్చితంగా ఉంది. వారి అండదండలతోనే చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగింది. నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హననం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టుతో జగన్ రాజకీయ ఆత్మహత్య చేసుకున్నాడు” అని అన్నారు.