మధ్యప్రదేశ్ లో అద్భుత ఆలయం ఆవిష్కృతం కాబోతుంది. సాగర్ జిల్లాలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సంత్ రవిదాస్ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ ఆలయానికి ప్రధాని నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని గత 5 నెలల్లోనే నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు. తాజాగా దళిత సమాజం ఎక్కువగా ఆరాధించే సంత్ రవిదాస్ ఆలయ నిర్మాణం ప్రారంభించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
నూతన ఆలయం 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నగరా శైలిలో నిర్మించనున్నారు. రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయనున్నారు. సంత్ రవిదాస్ గురించి ఆధునిక సమాజానికి తెలిసేలా ఓ మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్నారు. అందులో రవిదాస్ భక్తి మార్గం, నిర్గుణ ఆరాధన, తత్వశాస్త్రం, సాహిత్యం గ్యాలరీలు ఉంటాయి. గ్రంథాలయం, సమావేశ మందిరం, జల కుంద్, భక్తి నివాస్‌లను సైతం నిర్మించనున్నారు. ఈ ఆలయం నిర్మితమైతే దేశ, విదేశాల నుంచి సంత్ రవిదాస్ భక్తులు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే 15వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
14వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్తగా సంత్ రవిదాస్ ఖ్యాతి పొందారు. మధ్యయుగ కాలంలో భారతదేశంలో భక్తి ఉద్యమ బాగా ప్రాచుర్యం పొందింది. ఆ ఉద్యమ కాల ప్రముఖుల్లో ఒకరిగా సంత్ రవిదాస్ కీర్తి గడించారు. ఇదివరకే సత్నా జిల్లాలోని మైహర్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో సంత్ రవిదాస్ ఆలయాన్ని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్మించింది. బుందేల్ ఖండ్‌లో భాగమైన సాగర్‌లో 20-25 శాతం దళిత జనాభా నివసిస్తున్నారు. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాల్లో 35 ఎస్సీ రిజర్వ్డ్. 2013 ఎన్నికల్లో భాజపా వీటిలో 28 స్థానాలు కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో మాత్రం ఆ సంఖ్య భారీగా పడిపోయింది. భాజపా 18 చోట్ల విజయ దుందుభి మోగించగా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది.