తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సంపదను ప్రజలకు చేరే విధంగా మేము పోరాటం చేస్తున్నాం.. దోచుకోవడం కోసం కొందరు ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నారు.. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి కానీ, తెలంగాణలో అది లేదు.. అధికారంలోకి వచ్చి డబ్బు, మద్యం, అధికారం అడ్డుపెట్టుకొని దోచుకుంటున్నారు అంటూ భట్టి విక్రమార్క అన్నారు.
జరుగబోయే యుద్ధంలో ధర్మం గెలువబోతోంది అని భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది.. 74, 78 స్థానాలు భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ఆయన పేర్కొన్నారు. మొన్నటి తుక్కుగూడ సభనే దీనికి సంకేతం.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 డిక్లరేషన్లను అమలు చేస్తాం.. రైతు రుణమాఫీ చేసింది మేము కాదా.. గ్యారెంటీ కార్డ్స్ ను ఇంటింటికి పంచాం.. మేము అధికారంలోకి వచ్చాక ప్రజలు ఆ కార్డ్ పట్టుకొచ్చి మమ్మల్ని నిలదీయవచ్చు.. గ్యారెంటీ కార్డును భద్ర పర్చుకోండి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యనించారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ అవినీతికి బ్రేక్ వేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి అని భట్టి విక్రమార్క అన్నారు.