తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. సూర్యాపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రగతి నివేదన సభకు హాజరుకానున్నారు. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని మైదానాన్ని అధికారులు సిద్ధం చేశారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు.. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సహా ఉమ్మడి నల్లొండ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు.ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట చేరుకోనున్న సీఎం కేసీఆర్.. తొలుత వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత సామూహిక కూరగాయల మార్కెట్ యార్డ్, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. చివరన బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక్కడ ప్రారంభించాల్సిన భవనాలను ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని మైదానంలో ప్రగతి నివేదన సభకు హాజరై.. ప్రసంగించనున్నారు. ఈ సభను ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పదేళ్ల పాటు జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన వివరాలు ఇలా: భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్.. అక్కడ అధికారులతో ముచ్చటించి, అక్కడే భోజనం చేస్తారని అధికార యంత్రాంగం తెలిపింది. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా సూర్యాపేట పట్టణం అంతా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నిండి గులాబీ సొగను విరజిమ్ముతోంది. చౌరస్తాలు, కూడళ్లు గులాబీ రంగుతో ముస్తాబయ్యాయి. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ పాల్గొనే తొలి సభ ఇదే కావడంతో.. మంత్రి జగదీశ్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సుమారు రెండు లక్షల మందితో సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఒకేరోజు నాలుగైదు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉండడంతో పట్టణంలో సీఎం కేసీఆర్ సుమారు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తారని అధికార యంత్రాంగం తెలిపింది. అందుకు తగినట్లు 3 వేల మందితో భారీ బందోబస్తును పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే సీఎం.. మళ్లీ సాయంత్రం 4.45 గంటలకు హైదరాబాద్ తిరిగి ప్రయాణమవ్వనున్నారు.