ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో రోజు కడపలో పర్యటిస్తున్నారు. కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. తొలుత సీఎం ఉదయం ఇడుపులపాయ నుంచి కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల హెలిప్యాడ్ వద్దకు చేరుకుని ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రాజీవ్ మార్గ్ రోడ్డు, రాజీవ్ పార్కు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. అక్కడి నుంచి 11:10 గంటలకు అల్‌డిక్సన్ యూనిట్‌కి చేరుకుని.. ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం 2.15 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1.00 గంటకు గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. 1.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.
సీఎం జగన్ మూడో రోజు పర్యటనలో భాగంగా.. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.. ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆర్ట్స్ కళాశాల మైదానం, రాజీవ్‌మార్గ్, రాజీవ్ పార్క్, కొప్పర్తి పారిశ్రామిక వాడ, కడప విమానాశ్రయాల వద్ద జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. ఈ విధులలో ఎస్పీతో పాటు, కడప డీఎస్పీ ఎం.డి. షరీఫ్, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మూడు చోట్ల సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణాలకు గండికోటలో భూమిపూజ చేశారు. గండికోట, తిరుపతి, విశాఖలో వీటిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టడం సంతోషమని, ఒబెరాయ్ గ్రూప్ ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్ కడుతోందని అన్నారు. ఒబెరాయ్ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.