త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) వ్యాఖ్యానించారు. నిరుపేదల వైపు నిలబడిన ప్రభుత్వానికి, పేదలను వంచించిన గత ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని తెలిపారు.పేదలకు, పెత్తందారులకూ మధ్య యుద్ధం జరగనుందని పేర్కొన్నారు. అమరావతి పేరుతో స్కామ్, స్కిల్ స్కామ్(Skill scam), ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, నీరు-చెట్టు పేరుతో దోపీడీ చేసిన వారితో యుద్ధం జరగబోతుందని మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో వరుసగా అయిదో ఏడాది వాహనమిత్ర నిధులను(Vahanamitra funds) సీఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్రతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి పొందుతుండగా.. 2,75,931 మంది ఖాతాల్లోకి రూ. 10 వేల చొప్పున జమచేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 99శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్(Voice of the voiceless) అని పేర్కొన్నారు. ఒకవైపు పేదల ప్రభుత్వం ఉంటే మరోవైపు పేదల్ని మోసగించిన వారు ఉన్నారని విమర్శించారు.
‘మన ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. గత పాలకులకు మనసు లేదు. పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం(Govt) మనది. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని అమలు చేశాం. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. లంచం, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేశాం. గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కడే. గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారు? పేదవాడి ప్రభుత్వం నిలబడాలి. పెత్తందారుల ప్రభుత్వం రాకూడదు. వచ్చే ఎన్నికలప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించాలని సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి.. వాళ్లలాగా నాకు దత్తపుత్రుడి తోడు లేదు. వాళ్లు మాదిరిగా నాకు గజదొంగల ముఠా తోడుగా లేదు. దోచుకొని పంచుకొని తినడం నా విధానం కాదు. మీ ఇంట్లో మంచి జరిగిందనిపిస్తే నాకు తోడుగా నిలవండి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో నాకు అండగా నిలబడండి. ఓటు వేసే ముందు జరిగిన మంచి గురించి ఆలోచించండి.’ అని సీఎం జగన్ ప్రజలకు సూచించారు.