Child Health: ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులు వారిని సరిగ్గా గమనించకపోవడమే. దీని గురించి చాలా మందికి అవగాహన కూడా ఉండటం లేదు. 14 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల్లో మానసిక సమస్యలు చాలా పెరుగుతున్నాయి. యుక్తవయస్సులో పిల్లల్లో అనేక మార్పులు జరుగుతాయి. దీని కారణంగా వారు కొన్నిసార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల తల్లిదండ్రులు మానసిక ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలను విస్మరించకూడదు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఈరోజుల్లో చాలా ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం వల్ల చాలాసార్లు పిల్లలకు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉండదు. దీనివల్ల వారు ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వెంటనే దృష్టి సారించాలి. తద్వారా సమస్యకు సకాలంలో పరిష్కారం లభిస్తుంది. కౌన్సెలింగ్, మందులు లేకుండా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలతో మాట్లాడేందుకు సమయం కేటాయించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వారితోనే ఉన్నారని వారికి నమ్మకం కలిగించాలి. వారి సమస్యలను శ్రద్ధగా విని పరిష్కరించాలి. ఎందుకంటే కొన్ని మానసిక సమస్యలు కౌన్సెలింగ్ లేకుండా మందులు లేకుండా నయం చేయవచ్చు.
ఓర్పుతో పని చేయండి
మీ బిడ్డ మానసిక ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నట్లయితే చిరాకు, ఒంటరిగా జీవించడం, పాఠశాలకు వెళ్లకపోవడం, చదువుపై ఆసక్తి చూపకపోవడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో పిల్లలపై కోపం తెచ్చుకునే బదులు వారిని ప్రేమగా దగ్గరకు తీసుకొని సమస్య తెలుసుకోండి. మీ కోపం పిల్లల మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోండి.
బహిరంగ ఆటలు
ఈ రోజుల్లో పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరూ ఎక్కువ భాగం ఫోన్లలోనే గడుపుతున్నారు. దీని కారణంగా నిద్ర విధానం మారిపోతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. రోజువారీ దినచర్యలో భాగంగా ఆరుబయట ఆటలు ఆడేలా పిల్లలను ప్రోత్సహించండి. దీనివల్ల శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
యోగా, వ్యాయామం
మంచి మానసిక ఆరోగ్యం కోసం చిన్నతనం నుంచి పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం అవసరం. కొన్ని సులభమైన యోగాసనాలు పిల్లలకు నేర్పించవచ్చు. అంతే కాకుండా సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ వంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేసేలా వారిని తయారు చేయాలి. అప్పుడే ఎటువంటి సమస్య వచ్చినా వారు ధృడంగా ఉంటారు.