క్యాసినో గేమ్స్‌తో పాప్యులర్ అయ్యి.. క్యాసినో కింగ్‌గా ఎదిగిన చీకోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన బీజేపీ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు. అయితే, పలు వివాదాల్లో ఉన్న ఆయనను బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తుందా? అన్నది సస్పెన్స్‌గా మారింది. రేషన్ షాపు నడపటం నుంచి మొదలు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి క్యాసినో కింగ్‌గా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్‌పై ఈడీ కేసులు నమోదై ఉన్న విషయం తెలిసిందే. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఈడీ కేసులనూ ఎదుర్కొంటున్నారు. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయానికి ప్రైవేట్ గన్ మెన్లతో వెళ్లిన చీకోటి ప్రవీణ్ మరోసారి వివాదాస్పదమాయ్యారు.
ముగ్గురు గన్ మెన్ల వద్ద ఫార్జరీ లైసెన్స్‌లు ఉండటంతో వారితోపాటు చీకోటి ప్రవీణ్‌పై కూడా ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చీకోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. థాయిలాండ్, నేపాల్ దేశాల్లో క్యాసినో వ్యవహారాల్లో కూడా చీకోటి ప్రవీణ్ పేరు వినిపించిన విషయం తెలిసిందే. హిందుత్వం కోసం పని చేస్తున్నా అని తరచూ చెప్పుకొనే చీకోటి ప్రవీణ్ తాజాగా బీజేపీ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని ఢిల్లీలో చీకోటి ప్రవీణ్ కలిశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతోనూ ఆయన భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదాస్పద తీరుతో, వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో ఉండే చీకోటి ప్రవీణ్‌ను బీజేపీ చేర్చుకుంటుందా? అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.