ఇటీవలి కాలంలో డిఫాల్ట్ రుణాలను వసూలు చేయటంలో రికవరీ ఏజెంట్ల పాత్ర బాగా పెరిగింది. అయితే.. బకాయిల వసూలు క్రమంలో వీరి వ్యవహారం చాలా అభ్యంతరకరంగా, దురుసుగా ఉంటోంది. అందుకే రికవరీ ఏజెంట్ల విషయంలో ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను నియమాలను నిర్దేశించింది. బ్యాంకు లేదా దాని ఏజెంట్లు వీటిని ఉల్లంఘిస్తే ఆర్బీఐ గట్టిగా చర్యలు తీసుకుంటుంది. ఆ వివరాలు..
రికవరీ ఏజెంట్లను నియమించుకున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏజెంట్ల సంగతిని కనిపెట్టి చూడాలి. రికవరీ సమయంలో ఏజెంట్లు మానసికంగా వేధించటం, శారీరకంగా బాధపెట్టటం చేయరాదు. రుణ గ్రహీతలను పదిమందిలో అవమానించటం, అతని గోప్యతకు భంగం కలిగించడం చేయరాదు. రికవరీ ఏజెంట్లు ఫోన్ లేదా సోషల్ మీడియాలో ఎలాంటి అనుచితమైన సందేశాలను పంపటం, బెదిరించటం చేయరాదు. రికవరీ కాల్స్ కేవలం ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే చేయాలి. బకాయిల రికవరీ కోసం రుణగ్రహీతల స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం, వారిని ఒత్తిడి చేయటం కుదరదు. రుణ గ్రహీతలు పనిచేసే ఆఫీసుకు వెళ్లి అరుపులు, కేకలు వేసి వారి పరువు తీయటం అసలే చేయరాదు.
రికవరీ ఏజెంట్ వల్ల తన పరువుకు భంగం కలిగిస్తే.. రుణ గ్రహీత అతనిపై, ఆ బ్యాంకుపై పరువునష్టం దావా వేయొచ్చు.
రుణగ్రహీత వాహనాలు, ఆస్తులను రికవరీ ఏజెంట్ స్వాధీనం చేసుకుంటే వారికి వ్యతిరేకంగా కోర్టులో అతిక్రమణ దావా వేయొచ్చు.
రికవరీ ఏజెంట్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్, ఇ-మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లను ట్రాక్ చేసి పెట్టుకుంటే.. వాటిని ఆధారాలుగా కోర్టు ముందు ఉంచొచ్చు. ఏజెంట్ల వ్యవహార శైలి శృతిమించితే.. తక్షణ ఉపశమనం కోసం రుణగ్రహీత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. పోలీసులు స్పందించకపోతే.. బ్యాంకుకు వ్యతిరేకంగా కోర్డులో సివిల్ ఇంజంక్షన్ దాఖలు చేయటంతో బాటు వేధింపులకు పరిహారం కోరవచ్చు. ఈ వేధింపులను సాక్ష్యాలతో సహా.. బ్యాంకులోని రుణ విభాగపు అధికారి లేదా బ్యాంకు అంబుడ్స్‌మన్ దృష్టికి తేవచ్చు. అప్పటికీ వేధింపులు ఆగకపోతే.. నేరుగా ఆర్‌బీఐకు ఈమెయిల్ లేదా లెటర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.