ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియన్ ఇంటలిజెన్స్ ఒక నూతన అధ్యాయం అని చెప్పొచ్చు. దీంతో రోబోలను తయారు చేసే దిశగా, మనిషికి కావలసినవన్నీ పని చేసి పెట్టె విధంగా ప్రోగ్రామర్లు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పుట్టుకొచ్చింది చాట్ జీపీటీ (ChatGPT). కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ గురించే ఎక్కడ చూసినాచర్చ నడుస్తోంది. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన చాట్‌జీపీటీ అనూహ్య ఆదరణ సొంతం చేసుకుంది. అయితే దీని రాకతో ఉద్యోగాలకు ఎసరు అంటూ కొందరు వాదిస్తుంటే.. కొత్త తరహా ఉద్యోగాలు పెరగటంతో పాటూ ఉత్పాదకత పెరుగుతుందని మరి కొందరు ఏఐ వినియోగాన్ని సమర్థిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అనలటిక్స్ ఇండియా మ్యగజైన్ విడుదల చేసిన నివేదిక ఆసక్తికరంగా మారింది. 2024 నాటికి చాట్‌జీపీటీని మేకర్స్ దివాలా తీసే ప్రమాదం ఉందని ఆ నివేదిక ద్వారా తెలిపింది.
చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐను రూపొందించిన శామ్ ఆల్ట్‌మన్ ఆర్థిక సంక్షోభం అంచున ఉండే అవకాశం ఉందని ఆ నివేదికలో వెల్లడించింది. ‘ఎక్కువ ఖర్చుతో ఉండే API లను ఏఐలో వినియోగించటం కూడా నష్టాలకు ముఖ్య కారణం. ఒక్కో ఏఐ సర్వీసును రోజంతా అందించటానికి రూ.5.80 కోట్లు ఖర్చవుతోంది. దీంతో ఆల్ట్‌మన్ సంస్థ ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే అవకాశం లేకపోలేదు. GPT-3.5, GPT-4 వెర్షన్లు తీసుకొచ్చి డబ్బును ఆర్జించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఫలితాలు ఇవ్వలేకపోయాయి’ అని నివేదికలో తెలిపింది.
చాట్‌జీపీటీ ఇప్పటి వరకు లాభాల బాట పట్టలేదని అనలటిక్స్ తన నివేదికలో తెలిపింది. దీంతో పాటూ ఈ ఏఐ వాడకం కూడా క్రమేపీ తగ్గిందని పేర్కొంది. జూన్‌లో 1.7 బిలియన్ల మంది చాట్‌జీపీటీని వినియోగిస్తుండేవారు. కానీ, ప్రస్తుతం వీరి సంఖ్య 12శాతం క్షీణించి 1.5 బిలియన్లకు చేరింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. మొదట్లో చాలా కంపెనీలు తమ సంస్థలో చాట్‌జీపీటీ వినియోగానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు తమ సంస్థల కోసం ప్రత్యేకంగా ఏఐ చాట్‌బాట్‌లను తయారు చేయించుకుంటున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సరికొత్త కృత్రిమ మేధ వ్యవస్థ ‘లామా2’ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.