మలేసియా రాజధాని కౌలాలంపుర్‌కు ఉత్తరాన ఉన్న హైవేపై ఘోర ఫ్లైట్ ఆక్సిడెంట్ జరిగింది. చార్టర్ విమానం అదుపుతప్పి కూలడంతో 10 మంది మృతి చెందారు. లంకావి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఎక్స్‌ప్రెస్ వేపై కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది మృతి చెందారని అధికారులు చెప్పారు. ఈ విమానం ఎక్స్‌ప్రెస్ వేపై కూలడం వల్ల కారుతో పాటు బైక్‌ను ఢీ కొట్టిందని.. దీంతో మరో ఇద్దరు మరణించారని తెలిపారు.
మధ్యాహ్నం 2.47 నిమిషాలకు సుబంగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌కు తాము ప్రమాదంలో ఉన్నట్లు విమానం నుంచి సందేశం వచ్చిందని.. ఆ తర్వాత 2.48కి ఎమర్జెన్సీ లాండింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు అధికారులు వివరించారు. సిగ్నల్ ఇచ్చిన మూడు నిమిషాలకే 2.51 నిమిషాల సమయంలో విమానం రహదారిపై కూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకునేందుకు విమానం బ్లాక్ బాక్స్‌ను వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు అమెరికాకు చెందిన ఓ పైలట్ ప్రయాణిస్తున్న విమానంలోనే మరణించారు. బాత్రూంకు వెళ్లిన పైలట్ హఠాత్తుగా అక్కడే కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన కో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ పైలట్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.లాటమ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం స్థానిక కాలమానం ప్రకారం.. గత ఆదివారం రాత్రి మియామీ ఎయిర్‌పోర్టు నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత కెప్టెన్ ఇవాన్ ఆండౌర్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత బాత్రూమ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడే కుప్పకూలిపోయారు.
దీనిని గమనించిన ఇతర సిబ్బంది వెంటనే అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు విమానాన్ని సమీపంలోని పనామా ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సిబ్బంది హుటాహుటిన ఇవాన్‌ను పరిశీలించి.. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన సమయంలో విమానంలో 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. 56 ఏళ్ల ఇవాన్ గత 25 ఏళ్లుగా పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపై లాటమ్ ఎయిర్‌లైన్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే ఆ విమానంలోని ప్రయాణికులను మరుసటి రోజు చిలీకి చేర్చినట్లు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.