ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ (CBSE)గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ జగన్ ప్రభుత్వం(Jagan Govt) ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్న ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షలను.. పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు.
సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ కొత్త పరీక్షల విధానాన్ని(New examination procedure) అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో మొత్తం నాలుగు పీడబ్ల్యూటీలు, రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాతపరీక్షలు, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాతపరీక్షలు, 10 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఈ కొత్త విధానం ప్రకారం పదోతరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉండనున్నాయి. మొదటి భాషగా ఇంగ్లిష్, రెండో భాషగా తెలుగు ఉంటుంది. అయితే మూడో భాష హిందీ ఉండదు. ఆరో సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనున్నారు. ఈ సబ్జెక్టుకు సంబంధించి 50 మార్కులకు థియరీ పరీక్ష, 50 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.