చంద్రుడిపై నిగూఢ రహస్యాలను తెలుసుకునేందుకు భారత దేశం చేస్తున్న ప్రయత్నాల్లో మూడోదైన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా సాగిపోతోంది. ఇప్పటికే భూమి నుంచి చంద్రుడివైపుకు బయలుదేరిన ఈ అంతరిక్ష నౌక ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తోంది, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న దానిపై ఇస్రో మరో అప్ డేట్ విడుదల చేసింది. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3లో రేపు కీలక ఘట్టం జరగనుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ శనివారం నాడు చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఆగస్టు 5 రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. అక్కడి నుంచి మరింత కీలకమైన ప్రయాణం ఉంటుంది. దీనికి సంబంధించిన తాజా వివరాలతో కూడిన చిత్రాన్ని ఇస్రో ట్వీట్ చేసింది.
ఇందులో ఇస్రో చెబుతున్న ప్రకారం చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక చంద్రుడి మార్గంలో చేయాల్సిన మొత్తం ప్రయాణంలో మూడొంతులు ఇప్పటికే ప్రయాణం పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది మరో వంతు ప్రయాణం మాత్రమే. అయితే ఇప్పటివరకూ చేసిన ప్రయాణం ఓ ఎత్తు, ఇకపై చేయాల్సింది మరో ఎత్తు కాబోతోంది. రేపు సాయంత్రం లూనార్ ఆర్బిట్ ఎంట్రీ తర్వాత చంద్రయాన్ 3 చంద్రుడి చుట్టూ హెలికాఫ్టర్ లా పరిభ్రమిస్తూ తన కక్ష్యను తగ్గించుకుంటూ వచ్చి చివరికి చంద్రుడిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది.
రేపు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఎదురయ్యే ప్రతికూలతల్ని తట్టుకుని విజయవంతంగా ప్రయాణం సాగిస్తే ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ఇది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ నౌక మొత్తం ల్యాండ్ కాకుండా విడిపోయి కేవలం విక్రమ్ ల్యాండర్ ను మాత్రమే చంద్రుడిపై దిగేలా చేస్తుంది. అయితే చంద్రుడిపై దిగే క్రమంలో ప్రతికూల పరిస్ధితుల్ని తట్టుకోవడంలో విఫలమైన చరిత్ర గత విక్రమ్ ల్యాండర్ కు ఉండటంతో ఈ ఘట్టం ఈసారి మరింత కీలకం కాబోతోంది. అయితే గతంలో ఎదురైన పొరబాట్లను సరిదిద్దుకుని ఈసారి ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చెబుతోంది.