భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగించారు. జాబిల్లిపై ప్రయోగాలకోసం భారత్ మూడోసారి చేపడుతోన్న ఈ యాత్రపై యావత్ దేశంతోపాటు ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ సహాయంతో నేడు (జులై 14) నింగిలోకి బయలుదేరిన చంద్రయాన్-3.. 3.84లక్షల కి.మీ దూరం ప్రయాణం చేయనుంది. దాదాపు 45 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు చివరి వారంలో చంద్రుడిపై దిగే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్కడ సురక్షితంగా దిగిన అనంతరం ల్యాండర్, రోవర్‌లు 14 రోజులపాటు అక్కడ పరిశోధనలు చేసేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
చంద్రుడిపై అన్వేషణ కోసం భారత్ ఇప్పటికే రెండు సార్లు ప్రయోగాలు చేపట్టింది. 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 జాబిల్లి కక్ష్యలో 312 రోజులపాటు పనిచేసింది. కానీ, నాలుగేళ్ల కిందట చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం మాత్రం ఆఖరి క్షణాల్లో విఫలమైంది. అయితే, ల్యాండింగ్ క్రమంలో వైఫల్యానికి ఉన్న ఆస్కారాలను విశ్లేషించుకొని, దాన్ని అధిగమించేలా (ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్) చంద్రయాన్-3ని ఇస్రో రూపొందించింది. అనుకోని అవాంతరం తలెత్తినా ల్యాండర్.. విజయవంతంగా కిందకు దిగేలా ఏర్పాట్లు చేసింది. విక్రమ్ ల్యాండర్‌తో పాటు ప్రజ్ఞాన్ రోవర్‌లు చంద్రుడిపై సురక్షితంగా దిగితే.. ప్రపంచంలోనే చంద్రుడిపై సురక్షితంగా దిగిన నాలుగో దేశంగా భారత్ ఘనకీర్తి సాధించనుంది.
చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6వేల కిలో మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది. నాలుగు ఇంజన్ల ససాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.