జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3.. తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు ‘చంద్రయాన్-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్’ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది.
చంద్రయాన్-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే శనివారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో మూడింట రెండొంతులు ఇప్పటికే పూర్తి చేసుకుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది.
ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. చంద్రుడి దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే భూమి చుట్టూ కక్ష్యలను విజయవంతంగా పూర్తిచేసుకోగా.. చంద్రుని దిశగా వెళ్తున్న ఈ వ్యోమనౌక మూడింట రెండు వంతుల ప్రయాణాన్ని పూర్తిచేసుకుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం తెలిపింది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి అడుగుపెట్టనుందని తెలిపింది. ఈ నెల 23న సాయంత్రం జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 చంద్రునికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం దీని పనితీరు బాగానే ఉందని, చంద్రుని కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 23న దీన్ని చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్‌కు ఇదే ప్రధానమైన తేడా అని పేర్కొంది. గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండింగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొనగా.. విక్రమ్ ల్యాండర్‌లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి.
చంద్రయాన్ ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్న వైపు నుంచి.. నేటి నుంచి చంద్రుని చుట్టూ వ్యతిరేక దిశలో తిరుగుతుంది. వాహనం మొదట దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది, ఆ తర్వాత 100 కి.మీ దూరం తర్వాత వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. వాస్తవానికి చంద్రయాన్ చంద్రుడిని ఐదు రౌండ్లు చేస్తుంది. ప్రస్తుతం మొదటి సైకిల్‌లో 40 వేల కి.మీ.ల కక్ష్యలో ఈ వాహనాన్ని నెలకొల్పనుండగా.. ఆ తర్వాత ఆగస్టు 6న రెండో కక్ష్యలో 20 వేల కి.మీ.లో నెలకొల్పనున్నారు. ఆగస్టు 9న మూడో కక్ష్యలో చంద్రునికి 5 వేల కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-3ని ప్రవేశపెడతారు. దీని తరువాత,చంద్రయాన్ ఆగస్టు 14 న 1000 కిమీల నాల్గవ కక్ష్యలో ప్రవేశించనుంది. ఆగస్టు 16న 100 కిమీ చివరి కక్ష్యలో తిరుగుతుంది.
చంద్రయాన్‌ను ప్రత్యక్షంగా ట్రాక్ చేయడానికి బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) నుంచి ఇస్రో దాని వేగం, నిర్మాణం, దిశను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇస్రో సామాన్య ప్రజల కోసం లైవ్ ట్రాకర్ (చంద్రయాన్ 3 లైవ్ ట్రాకర్)ను కూడా ప్రారంభించింది. ఈ ట్రాకర్‌తో అంతరిక్షంలో అంతరిక్ష నౌక ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.