భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో బుధవారం చేపట్టనున్న కీలకమైన కక్ష్య తగ్గింపు ప్రక్రియతో చంద్రయాన్-3 జాబిల్లికి అత్యంత దగ్గర కానుంది. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కక్ష్య తగ్గింపు విన్యాసం ఉండనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోనుంది.
చంద్రయాన్-3ని విజయవంతగా చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఇస్రోకు అత్యంత కఠిన సవాలు ఎదురుకానుంది. ఆగస్టు 23న ఈ అంతరిక్షనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తున్న ఇస్రో… అందుకోసం “డీబూస్ట్” అనే పద్ధతిని వాడనుంది. దీనితో అడ్డంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న చంద్రయాన్-3 చివరి 30 కిలోమీటర్లకు వచ్చేసరికి నిట్టనిలువునా ల్యాండ్ కానుంది. ఈ అంతరిక్షనౌక వేగాన్ని చివరి 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు చేర్చే ప్రక్రియ అత్యంత కీలకమైన భాగమని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ఈ అంతరిక్షనౌక వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. చంద్రయాన్-2కు ఈ ప్రక్రియ వద్దే ఇబ్బంది తలెత్తిందని వివరించారు.
జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోంది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇప్పటికే మూడుసార్లు విజయవంతంగా ఇస్రో నిర్వహించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్-ISTRAC నుంచి ఈ ప్రక్రియ చేపట్టింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్-3కి అంతకుముందు వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ x 177 కి.మీలకు తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.