ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసి చంద్రునిపై భారత జండాను రెపరెపలాడేలా చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 ఘన విజయం సంధించింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు.
మరోవైపు భారత్ చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 పట్ల ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిని చూపాయి. రష్యా చేపట్టిన మూన్ మిషన్ లూనా 25న విఫలమైంది. ఈ నేపథ్యంలో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి స్టాఫ్ ల్యాండింగ్ కావడంపట్ల పలు దేశాలు భారత్‌కు ప్రధానంగా ఇస్రోకు అభినందనలు తెలిపాయి. కాగా, ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్ ఈ ఘనత దక్కించుకున్నది.
నాలుగేళ్ల కిందట చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జులై 14న చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్ లూనార్ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు.
ఆ తర్వాత ఆగస్టు 17న ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ‘ల్యాండర్ మాడ్యూల్’ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయింది. సొంతంగా చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత రెండు సార్లు డీ-అర్బిట్ ప్రక్రియలు చేపట్టి ల్యాండర్‌ను జాబిల్లి ఉపరితలానికి దగ్గర చేశారు.అలా బుధవారం సాయంత్రం 5.44 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్.. ల్యాండింగ్‌ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇస్రో.. ల్యాండింగ్ మాడ్యూల్‌కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) కమాండ్‌ను పంపించింది. ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్.. తన కృత్రిమ మేధ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. తన నాలుగు థ్రాటల్‌బుల్ ఇంజిన్లను ప్రజ్వలించి తన వేగాన్ని తగ్గించుకుంది. రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిల్లి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది.
ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ తన దిశను మార్చుకుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (ఎల్‌పీడీసీ), కేఏ బ్యాండ్ అండ్ లేజర్ బేస్డ్ ఆల్టీమీటర్లు, లేజర్ డాప్లర్ వెలోసీమీటర్ వంటి సాధనాలతో గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపింది.