స్కిల్ డెవలప్ మెంట్ కేసు(skill development case)లో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను మళ్లీ సోమవారానికి (అక్టోబరు 9) వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు తమకు కూడా సమర్పించాలని సీఐడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు(Supreme Court) త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఇటీవల ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు, సిద్ధార్థ లుథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారానికి వ్యతిరేకంగా సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని.. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని అన్నారు. ఆరోపణలు ఎప్పుడు వచ్చాయనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడు అనేది చర్చించాలని హరీశ్ సాల్వే వాదించారు.