టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటన ఉద్రిక్తంగా మారుతోంది. చంద్రబాబుకు పుంగనూరుకు వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. చంద్రబాబు వచ్చే మార్గంలో భీమగానిపల్లి వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా లారీలు, వాహనాలను నిలిపారు. దాంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు బాష్పవాయువును ప్రయోగించారు. ఓ దశలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్టు తెలిసింది. పోలీసుల వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అటు, చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయాక వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. టీడీపీ కార్యకర్తలకు చెందిన కార్లను లక్ష్యంగా చేసుకుని వైసీపీ వర్గీయులు దాడులు జరిపారు. 20 కార్లకు పైగా అద్దాలను ధ్వంసం చేశారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు… ఇక్కడి ఎమ్మెల్యేకి ట్యాగ్ అదే. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. ఇలాంటి నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేయాలి. పులివెందులకే వెళ్లాను… అంగళ్లుకు రాకూడదా? నేను కూడా చిత్తూరు జిల్లాలోనే పుట్టాను. పెద్దిరెడ్డి పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైంది. పుంగనూరు వెళుతున్నా… అక్కడ పుడింగి సంగతి తేలుస్తా” అని హెచ్చరించారు.
టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏంచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. డీఎస్పీ తన యూనిఫాం తీసేయాలని అన్నారు. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా? ధైర్యం ఉంటే రండి… చూసుకుందాం అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, అంగళ్లు నుంచి చంద్రబాబు ర్యాలీగా పుంగనూరు బయల్దేరారు. ఓపెన్ టాప్ వాహనంపై చంద్రబాబు నిలుచోగా, ఆయన కాన్వాయ్ వెంట భారీగా టీడీపీ శ్రేణులు ర్యాలీలో పాల్గొంటున్నారు.