గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే జాబ్‌లు కాకుండా ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్‌గా ఉండాలనుకునే వాళ్లు, కాస్త మాటకారితనం, అందరిలో కలిసిపోయే తత్వం ఉన్న వాళ్ళు, ఆతిథ్యరంగంపై ఆసక్తి ఉన్నవారికి హోటల్ మేనేజ్‌మెంట్ మేలైన కోర్సు. ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సు వివరాలు మీకోసం..
కోర్సు ఎక్కడ చేయాలి?
ఇంటర్‌లో ఏ గ్రూప్ తీసుకున్న వారైనా సరే, హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరవచ్చు. దేశవ్యాప్తంగా పలు కంపెనీలు హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్‌లు అందిస్తున్నాయి. కానీ, ది బెస్ట్ ఏంటి అంటే మాత్రం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ పేరే బాగా వినిపిస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్ రాయటం ద్వారా ఈ కంపెనీలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేయచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఇగ్నోతో కలిసి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుని అందిస్తోంది.
ఏం చదువుతారు?
బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, అకామడేషన్ ఆపరేషన్, ఫ్రంట్ ఆఫీస్, అకౌంటింగ్, కమ్యూనికేషన్, హోటల్ ఇంజినీరింగ్, న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, కంప్యూటర్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ అంశాల్లో అధ్యయనం చేస్తారు.
కోర్సు చివరలో ప్రాజెక్టు వర్కు పూర్తిచేయాలి. ఇందుకోసం విద్యా సంస్థలు ఏదైనా హోటల్ లేదా క్యాటరింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని శిక్షణ అందిస్తాయి. ఈ కోర్సును జనరిక్‌తోపాటు శాకాహారుల కోసమూ అందిస్తున్నారు. వెజిటేరియన్ కోర్సు ఎంచుకున్నవారికి వెజ్ అంశాల్లో ప్రత్యేక తర్ఫీదు అందుతుంది. వీరు మాంసాహార వంటలను నేర్చుకోనవసరం లేదు.
ఉద్యోగావకాశాలు
చదివిన స్పెషలైజేషన్ ప్రకారం.. కిచెన్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్, ఫ్లైట్ కిచెన్స్/ ఆన్‌బోర్డ్ ఫ్లైట్ సర్వీసెస్, వివిధ సేవా పరిశ్రమల్లో గెస్ట్/ కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్, ఫాస్ట్‌ఫుడ్ చెయిన్స్‌లో ఎగ్జిక్యూటివ్, క్యాటరింగ్ సంస్థలు, షిప్పుల్లో సప్లై, కిచెన్ సెక్షన్ ఉద్యోగాలు పొందవచ్చు.
అంతేగాక పర్యాటక సంస్థలు, కేంద్రాల్లో వివిధ రకాల సేవలు, బహుళజాతి కంపెనీల క్యాంటీన్లు, హౌస్ కీపింగ్ నిర్వహణ, హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో ఫ్యాకల్టీ, సొంతంగా ఫుడ్ చెయిన్ ప్రారంభించడం.. తదితర అవకాశాలు దక్కుతాయి.