తల్లి పురుడుపోసి జన్మనిస్తే… వైద్యులు ప్రాణం పోసి పునర్జన్మనిస్తారు అని నానుడి. కానీ, కొందరు వైద్యుల నిర్వాకం చూస్తే.. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తమ వృత్తికి విలువనివ్వకుండా డబ్బులకోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే మరోచోట సిన్సియర్ గా ఆపరేషన్ చేయాల్సిన సమయంలో నిర్లక్ష్యం వహించి చివరికి వైద్యం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న ప్రాణాలను బలిచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఏలూరులో వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణాల మీదికొచ్చింది. జిల్లా బోధనాసుపత్రిలో మహిళ పొట్టలో శస్త్ర చికిత్సకు ఉపయోగించే కత్తెర ఉంచి కుట్లు వేశారు. వివరాల్లోకి వెళితే.. పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.స్వప్న అనే మహిళ ప్రసవం కోసం ఏప్రిల్ 19న తేదీన ఏలూరు బోధనాసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. డిశ్చార్జి అయిన అనంతరం స్వప్న ఇంటికి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత తరచూ ఆమెకు కడుపులో నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే అనుకుని మందులు వాడేది.
అయితే ఈనెల 8న స్వప్నకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి ఏలూరులోని బోధనాసుపత్రికి చేరుకుంది. అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది. ఏలూరు బోధనాసుపత్రిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు.. ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిధర్‌ను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని తెలిపారు. ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పందించి విచారణ కమిటీ వేశారు.