ఢిల్లీలో ఇవాళ జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. విపక్షాల కూటమి ‘ఇండియా’ రెండు సమావేశాలు జరిగాయని, అందుకే కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలు తగ్గించాయని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మమతా సోషల్ మీడియాలో.. “గత రెండు నెలల్లో ఇప్పటివరకు, ‘భారత్’ కూటమి యొక్క రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి, ఈ రోజు మనం ఎల్‌పిజి గ్యాస్ ధరను రూ. 200 తగ్గించడం చూస్తున్నాము. ” అని పోస్ట్ చేశారు. ఇది భారతదేశం యొక్క శక్తి అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆతిథ్యంలో జూన్ 23న పాట్నాలో 26 పార్టీల కూటమి ‘ఇండియా’ తొలి సమావేశం జరిగింది. ఆ తర్వాత కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ రెండో సమావేశాన్ని నిర్వహించింది. ‘ఇండియా’లో టీఎంసీ, ఏఏపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, శివసేన మరియు జేఎంఎం వంటి అనేక పార్టీలు ఉన్నాయి. మరోవైపు విపక్షాల కూటమి (ఇండియా) యొక్క మూడో సమావేశం గురువారం (ఆగస్టు 31), శుక్రవారం (సెప్టెంబర్ 1) మహారాష్ట్రలోని ముంబైలో జరగనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)ని ఓడించేందుకు ఈ కూటమి ఏర్పడింది. దీనిపై ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తూనే ఉన్నాయి.