జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యానారాయణ సెటైర్లు వేశారు. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని మండిపడ్డారు. ఈ ఆరు నెలలు మాత్రమే అరుపులు, కేకలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, ఆయన కుమారుడు, ఒక సెలబ్రిటీ రాష్ట్రం అంతా తిరుగుతూ మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిపైన అసహనం ప్రదర్శిస్తున్నారు. 40 ఏళ్ల ఇండస్ర్టీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంగితజ్ఞానం ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజలు తరిమికొడితే హైదరాబాద్ లో కాపురం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు అన్నారు. ఇక, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అని ఫైర్ అయ్యారు. ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలోనే జరగలేదా..? చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అని సూచించారు బొత్స.. సెల్ ఫోన్ నేను కనిపెట్టానని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడడం లేదా? అని ఎద్దేవా చేశారు. అసలు లోకేష్ లెక్కల్లో మనిషే కాదన్న బొత్స.. సెలబ్రిటీ (పవన్ కల్యాణ్)కి టీడీపీ పాలన నచ్చడం అంటే పచ్చకామెర్ల వాళ్ళకు లోకం పచ్చగా కనిపించినట్టే అని సెటైర్లు వేశారు. టీడీపీ హయాంలో దోపిడీ.. పెత్తందారి వ్యవస్థ కనిపించలేదా.. ఋషికొండలో ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతుందని ఏడాది క్రితమే చెప్పానని గుర్తుచేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు జరుగితే నీకేంటి నొప్పి.. అని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రజలు నిన్ను హర్షించడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించేస్తానంటున్నారు.. అది ఎందుకో.. దాని వెనుక ఉన్న ప్రణాళికలు ఏంటో సెలబ్రిటీ చెప్పాలని డిమాండ్ చేశారు.
సంక్షేమం వైఎస్సార్ పేటెంట్.. దాని మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మంత్రి బొత్స.. ఉగాది తర్వాత సెలబ్రిటీ, చంద్రబాబు పరిస్థితి క్లోజ్ అవుతుందని జోస్యం చెప్పిన ఆయన.. ఈ ఆరునెలల కాలమే అరుపులు, కేకలు ఉంటాయన్నారు. 40 ఏళ్ల ఇండస్త్రీకి 4 ఏళ్ల పాలనకి తేడా సున్నా మాత్రమే.. మేం చేసిన మంచి పనులు 100 చెప్పగలుగుతాం.. మీరు ఏం చేశారు? అని ప్రశ్నించారు. రాజధానిలో 30 వేల కోట్ల భూములు కొనేశారని మాట్లాడడానికి అది నాలుకా, తాటిమట్టా అంటు ఫైర్ అయ్యారు. ఇక, తెలంగాణలో దోపిడీకి చంద్రబాబు కారకుడన్న ఆయన.. సైకిల్ పై కాలేజ్ కు వెళ్లిన చంద్రబాబు ఆస్తులు ఎంత..? స్కూటర్ మీద వెళ్లిన బొత్స ఆస్తులు విలువ ఎంత..?.. నక్కకి.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..! అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పగలరా..? అంటూ సవాల్ విసిరారు మంత్రి బొత్స సత్యనారాయణ.