కర్ణాటక ప్రభుత్వం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాల విడుదల(Release of Cauvery waters) చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతు, కన్నడ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. బంద్‌కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు కూడా పనిచేయట్లేదు. బంద్ ప్రభావం విమాన రాకపోకలపైనా పడింది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం(Kempegowda Airport)లో ఈ ఉదయం 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బంద్ నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఈ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మైసూరులో బస్టాండ్(Bus stand in Mysore) ఎదుట రైతు సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దీంతో బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు 50 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కావేరీ జలాల విడుదలపై హుబ్బళ్లిలో నిరసనలు చేపట్టాయి. నీటి విడుదల ఆపాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బంద్ దృష్ట్యా అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు చోట్ల CRPF బలగాలను మోహరించారు. కేఆర్‌ఎస్ ఆనకట్ట, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యటక, చారిత్రక కట్టడాల వద్ద ప్రభుత్వం భద్రతను పెంచింది.