భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ఎన్నో రహస్యాలకి పుట్టినిల్లుగా వెలుగొందుతోంది కంబోడియాలోని “అంగ్‌కోర్ వాట్ దేవాలయం”. ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది విష్ణు మూర్తి కొలువైన అంగ్‌కోర్ వాట్ దేవాలయం.
12వ శతాబ్ధంలో సూర్యవర్మస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కాని శిల్పాకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాల శైలి కనిపిస్తుంది. అంతేగాక పురాణాల ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 200 చ.కి.మీ విస్తీర్ణంలో నిర్మితమైన ఆలయం ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో అంకురార్పణ జరిగి నిర్మాణానికి సుమారు 30 సంవత్సరాల కాలం పట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఆలయ నిర్మాణం పశ్చిమ ముఖ ద్వారం కలిగి ఇతర ఆలయాలకు భిన్నంగా ఉంటుంది.
“టోనెల్ సాప్” సరస్సు తీరాన, 200 చదరపు కిలోమీటర్ల సువిశాలమైన ప్రదేశంలో.. “కులేన్” పర్వత శ్రేణుల పాదాల వద్ద అంగ్‌కోర్ వాట్ దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయం చాలా దేవాలయాల సముదాయం. పురాతన కాలంలోనే ఖచ్చితమైన కొలతలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ పని విధానంతో ఈ ఆలయాన్ని రూపొందించటం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందూ సాంప్రదాయ అస్థిత్వం ఉండే భారత ఉపఖండంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదని చెబితే అతిశయోక్తి కాదు.
ఆలయం తూర్పున మనిషి పుట్టుక, అవతారాల గురించిన శిల్పాలు, పశ్చిమాన ఉండే మండపం గోడలపై యుద్ధాలు, మరణాల గురించిన ఆకృతులలో దర్శనమిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ-రావణ యుద్ధం లాంటి అద్భుత సంఘటనలు సైతం ఈ గోడలలో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇక దక్షిణ మండపంలో రెండవ సూర్యవర్మన్ సైనిక పటాలం.. మహా మునులు, అప్సరసల నాట్య విన్యాసాలు, యమ ధర్మరాజు కొలువుదీరిన యమ సభలాంటి అనేక కళా ఖండాలు ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి. హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంగ్‌కోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంగ్ కోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల (65 మీటర్ల) ఎత్తైన భారీ గోపురంతో పాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఏకంగా 650అడుగుల (200 మీటర్లు) వెడల్పుతో 13అడుగుల (నాలుగు మీటర్ల) లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం.
ఖ్మేర్ పరిపాలనలో నీటిని నిల్వ ఉంచుకుని.. కరువు కాటకాలప్పుడు వాడుకునే టెక్నాలజీని అప్పట్లోనే అమలు చేశారు. కాబట్టే.. ఆ సామ్రాజ్యంలో కరువు ఛాయలు ఉండేవి కావట. వీరు నీటిని నిల్వ ఉంచేందుకు వాడిన టెక్నాలజీలో.. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట. అయితే ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయ్యిందనే విషయం నేటి ఆధునిక సాంకేతిన నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఒక రహస్యంగా ఉండిపోయింది. 5 మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు విశాలంతో నిర్మితమైన “బారే” (రిజర్వాయర్లు)లు ఆనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ పనితీరుకు అద్దంపట్టేలా దర్శనమిస్తున్నాయి.
అదలా ఉంచితే.. ఈ ఆలయ సందర్శనం జీవితంలో ఓ మరపురాని అనుభూతిగా మిగులుతుందటే ఆశ్చర్యపడాల్సింది లేదు. పచ్చగా పరచుకున్న పరిసరాలలో మమేకమవుతూ… మెకాంగ్ నదీమార్గం గుండా పడవలో ప్రయాణిస్తూ చేసే ప్రయాణం ఓ అందమైన జ్ఞాపకమవుతుంది.