హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లాలో ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. ఆగస్టు 12వ తేదీ ఉదయం సుందర్‌నగర్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్‌ప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ బస్సు.. మార్గమధ్యలో మండి జిల్లాలో రోడ్డు తెగిపోవడంతో లోయలోకి జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు లోయలో పడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ టీమ్స్ రక్షణ చర్యలు చేపట్టారు. కొందరు ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో NH5 పై ఉన్న సిమ్లా- కల్కా రోడ్డును మూసి వేశారు. అయితే ఈ రోడ్డును ఆగస్టు 10వ తేదీన తెరిచారు. తేలికపాటి వాహనాలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఆ రోడ్డులో బస్సు రావడంతో ఒక్కసారిగా రోడ్డు కుంగి ప్రమాదం జరిగింది.
మరోవైపు భారీ వర్షాల ధాటికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 200 రోడ్డు మార్గాలను అధికారులు మూసివేశారు. అంతేకాకుండా సుమారు 200 మార్గాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో తేలికపాటి వాహనాలను అనుమతించారు. దీంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.