పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ దేశానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వందలాది మంది పాకిస్తాన్ ప్రజలు కోపంగా ఉన్నారు. బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో తమ దేశ జెండా కనిపించకపోవడంతో వారు నిరాశ చెందారు.
ప్రదర్శనలో తమ దేశ జెండా కనిపిస్తుందనే ఆశతో పాకిస్థానీయులు బుర్జ్ ఖలీఫా దగ్గర వేచి ఉన్నారు. అర్ధరాత్రి దాటిన కొద్ది నిమిషాలకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై జాతీయ జెండా కనిపించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీని తరువాత, నిరాశ చెందిన ప్రజలు తమ మాతృభూమికి మద్దతునిస్తూ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడం ప్రారంభించారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని ఓ మహిళా.. తన మొబైల్ కెమెరాలో రికార్డు చేసింది. అనంతరం ఆమే మాట్లాడుతూ.. “సమయం అర్ధరాత్రి 12.01 గంటలు, బుర్జ్ ఖలీఫాపై పాకిస్థాన్ జాతీయ జెండాను ప్రదర్శించబోమని దుబాయ్ అధికారులు తెలియజేసారని చెప్పింది.
అయితే పాకిస్థాన్ తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఈరోజు (ఆగస్టు 14) జరుపుకుంది. పాకిస్తాన్ దేశం1947లో స్వతంత్రం పొందింది. భారతదేశం, పాకిస్తాన్ రెండూ 1947లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందాయి. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకుంటారు. విభజన సమయంలో పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మరియు తూర్పు పాకిస్తాన్ గా ఏర్పడింది. అయినప్పటికీ.. పాకిస్తాన్ ఐక్యంగా ఉండలేకపోయింది. దీంతో 1971లో తూర్పు పాకిస్తానీ తీవ్ర పోరాటం తర్వాత స్వాతంత్ర్యం పొందగా.. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది.