కొంత మంది రాజకీయ నాయకులు, సొంతంగా ప్రకటించుకున్న ఆర్ధిక నిపుణులు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పై ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చాలా స్పష్టంగా రాష్ట్ర అప్పుల గురించి వివరించారన్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం అందకూడదనే విపక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అప్పులపై చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారని, కానీ పార్లమెంటులో కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. ఏపీకి మొత్తంగా రూ.4.41 లక్షల కోట్ల అప్పు ఉందని సభా ముఖంగా కేంద్రం తెలిపిందన్నారు. కానీ విపక్షాలు ఆరోపించిన రూ.10 లక్షల కోట్లు ఎక్కడ? అని ప్రశ్నించారు. గురువారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు.
తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకొని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వం ఇప్పటి కంటే ఎక్కువగా అప్పులు చేసిందని, అప్పుడు వీరంతా ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. ‘నిబంధనలకు లోబడే రుణాలు చేస్తున్నాం. ఇలా మాట్లాడుతున్న అందరి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్. వీళ్ళెవరూ రాష్ట్రంలో నివాసం ఉండరు. ప్రతిపక్ష నాయకుడు నేను సింహాన్ని, కొదమ సింహాన్ని అంటున్నారు. అతని పుత్ర రత్నం కూడా మేం సింహాలం అంటున్నాడు. వీళ్ళు తమను తాము జంతువులతో ఎందుకు పోల్చుకుంటున్నారో అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. 2019లో చంద్రబాబు అధికారం దిగే నాటికి ఉన్న రాష్ట్ర అప్పు 2 లక్షల 64 వేల కోట్లు. 2023 లో అప్పు 4 లక్షల 42 వేల కోట్లు. అంటే మా ప్రభుత్వం నాలుగేళ్లల్లో చేసిన అప్పు లక్షా 77 వేల కోట్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 20 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో టీడీపీ, వాళ్ళ మీడియా బాధ మామూలుగా లేదని, ఎప్పుడూ కనిపించని గంటా కూడా అప్పుల పై స్టేట్ మెంట్లు ఇస్తున్నారన్నారు. గతంలో ఎప్పుడూ అప్పులపై రాష్ట్రానికి కేంద్రం సహకరించ కూడదని వీళ్ళంతా కుట్రలు చేశారన్నారు. కేంద్ర ఆర్ధిక మంత్రి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడితే దాన్ని నమ్మరని, కొత్తగా వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడితే ఫుల్ గా కవరేజ్ ఇస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఆర్బీఐ చెప్పినా నమ్మం అంటారని, స్వయం ప్రకటిత మేధావులు చెబితే అదే కరెక్ట్ అంటారన్నారు. దేశంలో నిబంధనలు ఉండవా?? మన రాష్ట్రానికి ప్రత్యేకంగా రూల్స్ ఉంటాయా? అని ఆయన ప్రశ్నించారు.